YSRCP Leaders Violated Election Code :రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. నామినేషన్ల ప్రక్రియలో వైఎస్సార్సీపీ నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తూ నామినేషన్ల వేళ అభ్యర్థులు పార్టీ జెండాలతో రెచ్చిపోతున్నారు. నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. వైఎస్సార్సీపీ నేతలను అధికారులు కూడా ఆపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోటిఫికేషన్ వచ్చినా పోలీసులు అధికార పార్టీ సేవలోనే తరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే కొందరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జోగి రమేష్ : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగి రమేష్ నామినేషన్ సందర్భంగా యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలించి మనిషికి 500, మద్యం, బిర్యానీ, అందజేసినట్లు చెబుతున్నారు. ర్యాలీకి వచ్చిన కార్యకర్తలు రోడ్డుపై విన్యాసాలు చేస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేశారు. పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఉద్యోగులు, విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతలు - నామినేషన్ వేసేందుకు వెళ్తూ - Election Code violation
మొండితోక జగన్మోహన్ రావు :ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు నామినేషన్ సందర్భంగా అడుగడుగునా వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడ్డారు. ఎన్నికల అధికారి ఉన్నప్పటికీ మున్సిపల్ కార్యాలయాన్ని వైఎస్సార్సీపీ నాయకుల వాహనాల పార్కింగ్‌కు వినియోగించడంపై ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇరువైపులా వైఎస్సార్సీపీ రంగులు వేయడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా డీజే వాహనాలను వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.