YSRCP Leaders Terrorized Voters with Attacks In Rayalaseema:అనంతపురం రూరల్ మండలం రాచనపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిండికేట్ నగర్ పోలింగ్ బూత్‌లోనికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కుటుంబీకురాలు నయనతారెడ్డిని ఎలా అనుమతిస్తారని ప్రశ్నించిన టీడీపీ నాయకులపై రాళ్ల దాడి చేశారు. ఉరవకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పలు పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి తనయుడు ప్రణయ్ రెడ్డి తన అనుచరలతో కలిసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అక్కడే కూర్చోని మైనార్డీ ఓటర్లను భయాందోళనలకు గురిచేసి పోలింగ్‌ను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు.
తాడిపత్రి మండలం బొడాయిపల్లి గ్రామంలో ఏడు రోజుల బాలింత అయిన తన భార్యను ఓటు వేయించడానికి తీసుకెళ్తున్న టీడీపీ నేత కృష్ణమూర్తిపై వైఎస్సార్సీపీ నాయకులు రాళ్ల దాడి చేశారు. పోలీసులే కృష్ణమూర్తిని పట్టుకొని దాడికి పాల్పడేలా చేశారని బంధువులు ఆరోపించారు. ఒకానొక సమయంలో రాళ్లదాడికి భయపడిన పోలీసులు చుట్టుపక్కల ఇళ్లలో దాక్కునే పరిస్థితి దాపరించింది. అనంతపురంలోని గుల్జార్ పేట కాలనీలోని పోలింగ్ బూత్‌లోకి వైఎస్సార్సీపీ మహిళ కార్పొరేటర్ నాగ వినీత దౌర్జన్యంగా ప్రవేశించడంపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అభ్యంతరం తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసినా పీవో చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరవకొండలో టీడీపీ తరపున ప్రచారానికి వెళ్లిన ముస్లిం మహిళపై దాడికి పాల్పడిన వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదైంది. టీడీపీ తరపున ప్రచారం చేస్తే కుటుంబాన్ని లేకుండా చేస్తామని బెదిరించారు.
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళావాయిపల్లిలోని 192 పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్‌పై దాడి చేసి వైఎస్సార్సీపీ వర్గీయులు లాగిపడేశారు. నిరసనగా గ్రామస్థులు ఈవీఎంలను పగలగొట్టారు. ఇతర పార్టీ ఏజెంట్లు లేకుండా పోలింగ్ ఎలా నిర్వహిస్తారని పీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా పాపక్క గారి పల్లెలో టీడీపీ ఏజెంట్లపై వైఎస్సార్సీపీ నాయకులు దాడికి తెగపడ్డారు. పోలింగ్ స్టేషన్ వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నడుమ పోలింగ్ నిర్వహించారు. పుట్టపర్తి నియోజకవర్గం సింగరాయపల్లిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్లిన కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పై వైఎస్సార్సీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ కేంద్రం పరిశీలనకు రావద్దంటూ నిలవరించారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో గొడవ సద్దుమణిగింది.
నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో దాడులతో రక్తసిక్తమైన పల్నాడు - YSRCP attacks in Palnadu
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని పార్థసారధి నగర్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు నొక్కాల్సిన బటన్‌ను వైఎస్సార్సీపీ నాయకుడే నొక్కడంపై బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతిస్తారని ఆర్వోని ప్రశ్నించారు. తప్పులు ప్రశ్నించిన వారిపైనే పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. బత్తలపల్లి మండలం మల్లవంతపు చర్లపల్లిలో టీడీపీ సానుభూతిపరులను ఓటు వేయకుండా వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇదేంటని ప్రశ్నించినవారిపై దాడికి తెగబడ్డారు. తనకల్లు మండలం దేవలం తండాలో వృద్ధురాలిని ఫ్యాన్ గుర్తుకు ఓటువేయాలని ఓపీఓ సూచించడంపై గ్రామస్థులు పీవో దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించకపోవడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేశారు. ఎట్టకేలకు ఓపీఓను విధుల నుంచి తప్పించడంతో ఆందోళన విరమించారు.
కర్నూలు శ్రీరామ నగర్ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ప్యాపిలి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రం వద్ద మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణమూర్తిపై చేయి చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి ఫోటోతో కూడిన స్లిప్‌లను ఓటర్లకు పంపిణీ చేసినందుకు అతనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ స్లిప్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుల ఆగడాలు మితిమీరి పోయాయి. మైదుకూరు, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు ఏజెంట్లను లక్ష్యంగా చేసుకొని వైఎస్సార్సీపీ అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డాయి. రాయచోటి నియోజకవర్గం చౌటుపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఎనిమిది ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు, ఖాజీపేటలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను వైఎస్సార్సీపీ కార్యకర్తలు బయటకు లాగి విచక్షణ రహితంగా దాడి చేశారు. పుల్లంపేట మండలంలో జనసేన కార్యకర్తల్ని కిడ్నాప్ చేశారు. ఆగ్రహించిన గ్రామస్థులు ఈవీఎంలను ధ్వంసం చేశారు.