YSRCP Leaders Occupied the Pond in Tandrapadu at Kurnool: 10 గ్రామాలకు తాగు, సాగు నీరు అందిస్తోన్న చెరువు అది. ఎంతో పురాతనమైన ఆ చెరువును కాపాడాల్సిన పెద్దలే గత ప్రభుత్వంలో కబ్జా చేశారు. వందల టిప్పర్లు మట్టి తోలి చదును చేశారు. చుట్టూ కంచె వేశారు. కబ్జాకు గురైన చెరువు కనిపించకుండా చెట్లు నాటేశారు. దీనిని అడ్డుకున్న స్థానికులపై కేసులు పెట్టారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు దీనిని ప్రత్యక్షంగా సందర్శించి అధికారంలోకి వచ్చిన వెంటనే కాపాడతానని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో చెరువును కబ్జాదారుల నుంచి విడిపించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
కర్నూలు శివారులోని బీ.తాండ్రపాడు గ్రామాన్ని ఆనుకుని గంగమ్మ చెరువు ఉంది. సుమారు 70 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. దీని పరిధిలో సూదిరెడ్డిపల్లి, బి.తాండ్రపాడు, నూతనపల్లి, పసుపుల తదితర పది గ్రామాలకు చెందిన వందల ఎకరాలకు సాగునీటితో పాటు, తాగునీరు అందుతోంది. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ చెరువును 2021లో కొందరు ఆక్రమించారు. వందల టిప్పర్లతో మట్టి తోలి 20 ఎకరాలు చదును చేశారు. కబ్జా గురించి తెలుసుకున్న స్థానికులు టిప్పర్లను అడ్డుకున్నారు. అడ్డుకున్న వారిని బెదిరించి దర్జాగా చెరువును ఆక్రమించేశారు. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ అండతో అక్రమార్కులు ఎవరినీ లెక్కచేయలేదు. కేవలం రెండు, మూడు రోజుల్లోనే కంచె వేసి మొక్కలు నాటేశారు. దీనిపై అప్పటి కర్నూలు ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు.