YSRCP Leaders Doing Irregularities :ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ వాలంటీర్ల ద్వారా ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసేందుకు వైఎస్సార్సీపీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో కొందరు వాలంటీర్లు ఓటర్ల జాబితా పట్టుకుని ఇంటింటికి వెళ్లి వారి సామాజిక వర్గాల వివరాలు సేకరించటం వివాదానికి దారితీసింది. ప్రత్యేక ప్రొఫార్మా ఒకటి సిద్ధం చేసుకుని మరీ వివరాలు సేకరిస్తుండటం చూస్తుంటే ఇదెంతో పకడ్బందీ వ్యవహారమని తెలిసిపోతుంది.
కుట్రలకు తెరలేపారా? :ఓటరు పేరు, కులం, ఉపకులం, ఓటర్ ఐడి కార్డు నంబర్, పోలింగ్ బూత్ వివరాలు, ఫోన్ నంబర్, ఇతర వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు. డివిజన్ నంబర్, సచివాలయం నంబర్, వాలంటీర్ పేరు, క్లస్టర్ వివరాలు కూడా ఆ ఫార్మాట్లో ఉన్నాయి. ఓటరు ఏ పార్టీ వారో కూడా ఓటర్ల జాబితాలో రాసుకోవటం అనుమానాలకు తావిస్తోంది. వైఎస్సార్సీపీకి ఓటేయకుంటే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని స్థానిక ఎన్నికల సమయంలో వాలంటీర్లు ఓటర్లను బెదిరించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అదే తరహాలో ఏదైనా కుట్రలకు తెరలేపారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
మీ ఓటును లేపేసిన అధికారులు - భారీగా బోగస్ ఓటర్లకు చోటు?
వాలంటీర్ల వద్ద ఓటర్ల జాబితా : గుంటూరు నగరంలో వాలంటీర్లు చేస్తున్న సమాచార సేకరణను అడ్డుకుని నిలదీశారు. టీడీపీ వారి ప్రశ్నలకు వాలంటీర్లు నీళ్లు నమిలారు. అసలు వాలంటీర్ల వద్ద ఓటర్ల జాబితా ఎందుకు ఉందన్న దానికి తమ కార్పోరేటర్ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల సంఘం ప్రతి రాజకీయ పార్టీకి ఓటర్ల జాబితా అందజేస్తుంది. దాని ప్రకారం ఏమైనా మార్పులు, చేర్పులకు సంబంధించి రాజకీయ పార్టీలు సూచనలు, అభ్యంతరాలు తెలియజేయవచ్చు. సంబంధిత రాజకీయ పార్టీకి సంబంధించి బూత్ లెవల్ ఏజెంట్లు ఆ పని చేస్తారు. కానీ ఇప్పుడు వాలంటీర్లు ఓటర్ల జాబితాను పట్టుకుని ఇంటింటికీ తిరగటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.