YSRCP Leaders Attacked On Family in Guntur District :అధికారం కోల్పోయినా వైఎస్సార్సీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట పడలేదు. దీపావళి టపాసులు తమ ఇంటి ముందు పడ్డాయని ఓ దళిత కుటుంబంపై వైఎస్సార్సీపీ నేతలు దాడికి తెగబడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే వైఎస్సార్సీపీ అరాచకమూకలు వారిపైనా దాడికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ఇప్పుడు ప్రాణభయంతో ఇళ్లు వదిలి బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు.
ధ్వంసమైన సామగ్రి, పగిలిన అద్దాలు, నేలపైన నెత్తుటి మరకలు ఇవన్నీ వైఎస్సార్సీపీ నేతల దాడికి ప్రత్యక్ష నిదర్శనాలు. గుంటూరు శివారు రెడ్డిపాలెంలోని ఓ అపార్టుమెంటులో దళిత వర్గానికి చెందిన సోని, తన కుమారుడు అవినాష్ నివాసం ఉంటున్నారు. గురువారం దీపావళి సందర్భంగా ఆపార్ట్ మెంట్ వద్ద అవినాష్ టపాసులు కాల్చారు. అవి ఎదురుగా ఉంటున్న వైఎస్సార్సీపీ నేత ఇంటి ముందు ఎగిరి పడ్డాయి. దీంతో వైఎస్సార్సీపీ నేత గొడవకు దిగాడు. అసభ్య పదజాలంతో దూషించడంతో అవినాష్ ఎదురు తిరిగాడు. వైఎస్సార్సీపీ నేత తన సోదరుడు నరేంద్రరెడ్డి ఇతర అనుచరులతో కలిసి అవినాష్‌పై దాడి చేశారు.
వైఎస్సార్సీపీ నాయకుడి దుశ్చర్య - అప్పు తీర్చమన్నందుకు దాడి
కర్రలు, రాడ్లతో ఇష్టారాజ్యంగా కొట్టారు. దెబ్బలు తగిలిన అవినాష్ ఇంట్లోకి వెళ్లిపోయాడు. అప్పటికీ ఆగని నరేంద్ర రెడ్డి ముఠా ఆపార్ట్ మెంట్లోకి వచ్చింది. అవినాష్ ఉండే ప్లాట్లోకి రాగా ఆయన తల్లి సోని అడ్డుకుంది. దీంతో ఆమెను జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించారు. వైఎస్సార్సీపీ మూకల దాడిలో సోనికి, అవినాష్‌కు గాయాలయ్యాయి. ఇంట్లో సామగ్రి ధ్వంసమైంది. దాడి విషయాన్ని అవినాష్ జనసేన నేతలకు తెలియజేసి ఆసుపత్రికి వెళ్లటానికి సహకారం కోరాడు. దీంతో వారు నల్లపాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జనసేన నేతలు అవినాష్ ఇంటికి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా పోలీసుల సమక్షంలోనే మరోసారి దాడికి తెగబడ్డారు. పోలీసులకు చెబుతారా అంటూ జనసేన శ్రేణులపైనా దాడి చేశారు. అవినాష్ తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనపై బాధితులు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితులను పోలీసులు ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతల దాడిలో గాయపడిన అవినాష్, సోని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రస్తుతం బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. చిన్నపాటి వాగ్వాదానికి ఇంతలా దాడి చేయడంపై అవినాష్ ఆయన తల్లి తీవ్ర ఆవేదన చెందారు.
దాడికి పాల్పడిన నరేంద్రరెడ్డి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వెంట తిరుగుతుంటాడు. ఇటీవల ఎన్నికల సమయంలో కొరిటపాడులో పోలింగ్ కేంద్రం వద్ద గొడవలు సృష్టించాడు. టీడీపీ వారిపై దాడికి వెళ్లాడు. ఇప్పుడు నరేంద్రరెడ్డి దాడిలో గాయపడిన వారు టీడీపీ సానుభూతిపరులే. అయితే ఎన్నికల సమయంలో ఓటు వేసి తమ పని తాము చూసుకుంటున్నామని బాధిత కుటుంబం తెలిపింది.
రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ శ్రేణులు - టీడీపీ నేతపై గొడ్డళ్లతో దాడి - murder attempt on tdp leader