YSRCP Leaders Attack on TDP Activist : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తప్ప మరో పార్టీ ఉండకూడదనేలా టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బుధవారం పుంగనూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
టీడీపీ కార్యకర్త హేమాద్రి ఉదయం 11 గంటల సమయంలో పట్టణంలోని సంతగేటుకు వెళుతుండగా అధికార పార్టీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారు. రాష్ట్ర జానపద కళల సంస్థ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం ఇంట్లోకి తీసుకెళ్లి చొక్కా చించి చితకబాదారు. ఇకపై టీడీపీ తరఫున ప్రచారం చేసినా, టీడీపీ నాయకులతో కలిసి తిరిగినా చంపేస్తామంటూ బెదిరించారు. అంతటితో ఆగకుండా రెండు తెల్లని పొడి ప్యాకెట్లు చేతులో పెట్టి, ముఖంపై కూడా చల్లారు.
వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు - టీడీపీ కార్యకర్తపై వైసీపీ మూకల దాడి - YCP ACTIVISTS ATTACK ON MAN
ఈ డ్రగ్స్ టీడీపీ నాయకులు సీవీరెడ్డి, గిరి, ఎ.నాగరాజ, ఎస్.సుహేల్ బాషా, సుబ్రహ్మణ్యం రాజు తదితరులు ఇచ్చారని బలవంతంగా చెప్పించి వీడియో తీశారు. ఇంతలో కిడ్నాప్ విషయం టీడీపీ శ్రేణులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. హేమాద్రిని బయటకు పంపాలంటూ వైసీపీ నాయకుడు కొండవీటి నాగభూషణం ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో హేమాద్రి వైఎస్సార్సీపీ కార్యకర్తల నుంచి తప్పించుకుని బయటకు వచ్చారు. 'వైసీపీ వాళ్లు తెల్లని పొడి ప్యాకెట్లు చేతిలో పెట్టి, ఈ డ్రగ్స్ టీడీపీ నేతలు ఇచ్చినట్లు చెప్పాలంటూ బలవంతంగా వీడియో తీశారు. ఆ ప్యాకెట్లలో ఏముందో నాకు తెలియదు. నా సెల్‌ఫోన్, బంగారు గొలుసు లాక్కున్నారు' అని హేమాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింకా చలపతి, కొండవీటి నాగభూషణం, అమ్ము, సాయి, ఇర్ఫాన్, ప్రభు, అమ్ముకుట్టి, మంజు నిందితులని ఫిర్యాదులో పేర్కొన్నారు.
హేమాద్రిపై ఎస్సీ ఎస్టీ కేసు :తెలుగుదేశం నాయకులు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుండగానే వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకుని స్టేషన్‌ను ముట్టడించినట్లు వ్యవహరించారు. బాధితుడైన టీడీపీ కార్యకర్త హేమాద్రిపై సీఐ రాఘవరెడ్డికి ఫిర్యాదు చేశారు. పుంగనూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ లలిత, కౌన్సిలర్లు లలిత, రేష్మలను ప్రభు అనే వ్యక్తి ఆలయానికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో హేమాద్రి అసభ్యంగా దూషించి దాడి చేశారని అందులో పేర్కొన్నారు. దీంతో హేమాద్రిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకులపై ఏ కేసు పెట్టారో మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
'పల్నాడులో ఇఫ్తార్ విందుకు టీడీపీ నేతలను పిలుస్తావా' అంటూ వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి - YCP Leader Attack
వైఎస్సార్సీపీ నేతలకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? :వైఎస్సార్సీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్త హేమాద్రిని అపహరించి చేతిలో డ్రగ్స్(తెల్లని పొడి) ప్యాకెట్లు చేతిలో పెట్టినట్లు వార్తలు వ్యాప్తికావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ మాదకద్రవ్యం వైసీపీ నాయకుల చేతికి ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలనిటీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఎవరి నుంచైనా వాటిని కొనుగోలు చేసి పుంగనూరులో వైసీపీ కార్యకర్తలు విక్రయిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 'డ్రగ్స్' మరకలను ప్రణాళిక ప్రకారం టీడీపీ నాయకులకు అంటగట్టి, అరెస్టులు చేసి ఎన్నికల వరకు పుంగనూరులో బయటకు రాకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారా? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు తప్పు చేసినా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపే పరిస్థితి లేదు. పోలీసు యంత్రాంగం మొత్తం అధికార పార్టీకే వత్తాసు పలుకుతోంది. ఎన్నికల కోడ్ వచ్చినా ఇదేవిధంగా వ్యవహరిస్తూ అపఖ్యాతి మూటగట్టుకుంటోంది. డ్రగ్స్ ఆరోపణలపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.
వైఎస్సార్సీపీ నేత దాష్టికం- కాలిన గాయాలతో బయటపడిన ఒంటరి మహిళ! నామమాత్రపు సెక్షన్లతో కేసు - YSRCP Leader Attack on Women