ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెద్దిరెడ్డి భూదందాపై ప్రాథమిక రిపోర్ట్ - జేసీ నుంచి తహసీల్దార్ వరకు అక్రమాలు - Peddireddy Land Grabbing - PEDDIREDDY LAND GRABBING

Peddireddy Ramachandra Reddy Land Grabbing: ప్రభుత్వ భూమికి రక్షణగా నిలవాల్సిన రెవెన్యూ అధికారులు వైఎస్సార్సీపీ ముఖ్య నేత చేతిలో కీలుబొమ్మలుగా మారారు. జాయింట్‌ కలెక్టర్ నుంచి తహసీల్దార్‌ వరకు ప్రతి ఒక్కరూ ఆయన అక్రమాల్లో పాలుపంచుకున్నారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పప్పూ బెల్లంలా పంచిపెట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాపై ప్రభుత్వానికి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాథమికంగా నివేదిక అందజేసింది. కుట్రలో భాగస్వాములైన వారందరిపైనా చర్యలకు సిఫార్సు చేసింది.

Peddireddy Land Grabbing
Peddireddy Land Grabbing (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 7:22 AM IST

Peddireddy Ramachandra Reddy Land Grabbing: వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందా ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తోంది. వేల ఎకరాలు బినామీల పేరిట దోచుకున్న పెద్దిరెడ్డికి నాటి అధికారులు అడుగులకు మడుగులొత్తారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో 100 కోట్లకు పైగా విలువైన 982.48 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూములుగా మార్చేసి కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్, ప్రస్తుత తిరుపతి కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ కుట్రకు పాల్పడినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తేల్చింది.

ఆయనతోపాటు పలమనేరు ఆర్డీవోలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్‌కుమార్‌రెడ్డి, నాటి పలమనేరు తహసీల్దార్‌ సీతారామ్ ఈ అవినీతిలో భాగస్వాములుగా విచారణలో వెల్లడైంది. వీరంతా నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడి ప్రభుత్వభూముల మ్యుటేషన్‌లో అక్రమాలు చేసినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్ధారించింది. వీరిందరిపైనా కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. ఈ ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతోపాటు బాధ్యులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

'పుంగనూరు పెద్దాయన' పాపాల పుట్ట - గత ఐదేళ్లు అంతులేని అరాచకాలు - YSRCP Leaders irregularities

చట్టపరమైన అంశాలు పట్టించుకోకుండా: రాగానిపల్లిలో 982.48 ఎకరాల భూమికి పుంగనూరు జమీందారు మహదేవరాయలు కుమారుడు శంకరరాయలు పేరిట 1958 ఫిబ్రవరి 20న చిత్తు పట్టా జారీ అయ్యింది. అనంతరం ఆయన దాన్ని పలువురికి విక్రయించారు. ఆ తర్వాత 1977వ సంవత్సరంలో ఈ చిత్తుపట్టాను అప్పటి కలెక్టర్‌ రద్దుచేశారు. దీంతో ఈ భూమిపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ భూమికి సంబంధించిన సెటిల్‌మెంట్ పునఃప్రారంభించాలంటూ 2022 ఏప్రిల్‌ 28న నాటి చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సెటిల్‌మెంట్‌ అధికారైన ఎస్‌. వెంకటేశ్వర్‌ను ఆదేశించారు. ఆయన నిబంధనలు, చట్టపరమైన అంశాలు పట్టించుకోకుండా సరైన తనిఖీలు చేయకుండా చిత్తుపట్టా కింద ఉన్న ఆ భూమిపై హక్కులిచ్చేందుకు అవకాశం కల్పించారు.

నిషేధిత జాబితా నుంచి తొలగించాలని: మాజీమంత్రి పెద్దిరెడ్డి దురుద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించారని విజిలెన్స్‌ నివేదికలో స్పష్టం చేసింది. పెద్దిరెడ్డి బినామీలైన ఎన్‌. వెంకటర్‌రెడ్డి మరికొందరు వ్యక్తులు ఈ 982.48 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తు చేసుకోగా, నాటి పుంగనూరు తహసీల్దార్‌ ఆ దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపించారు. నాటి జాయింట్‌ కలెక్టర్‌ పులి శ్రీనివాసులు ఈ భూమిని సబ్‌డివిజన్‌ చేసేందుకు గతేడాది సెప్టెంబరు 11న అనుమతిచ్చారు.

అంతకుముందే పుంగనూరు తహసీల్దార్‌గా పనిచేసిన టి.సీతారామ్‌ ఈ 982.48 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌ వెబ్‌ల్యాండ్‌ రికార్డ్స్‌లో చేర్చాలంటూ ఉన్నతాధికారులను కోరారు. మొత్తం విస్తీర్ణాన్ని 30 సబ్‌డివిజన్‌లుగా విభజించి, 28 మందికి కేటాయించాలని కోరారు. దీనిపై నాటి ఆర్డీవో శివయ్య పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి, దస్త్రాన్ని వెనక్కి పంపించినా లెక్కచేయలేదు. ఇలా తహసీల్దార్‌ మొదలుకుని కలెక్టర్‌ వరకూ అంతా కలిసి వందల ఎకరాల ప్రభుత్వభూమిని పెద్దిరెడ్డి బినామీల పరం చేశారు.

వేల కోట్ల స్కాములు - రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన 'పెద్దాయన' అవినీతి సామ్రాజ్యం - YSRCP Leader Scams

ABOUT THE AUTHOR

...view details