YSRCP Govt Neglect on Water Problem in Vizianagaram District :ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు ఏషియన్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (AIIB) ముందుకు వచ్చింది. ఈ పనులకు సంబంధించిన నిధులు గత ప్రభుత్వం పక్కదారి పట్టించడం వల్ల పథకం లక్ష్యం నీరుగారింది. బ్యాంకుతో ఒప్పందం ప్రకారం ఐదేళ్లలో పనులు చేపట్టకపోవడం వల్ల ఆ పథకం కాల వ్యవధి కూడా పూర్తయింది. ఎంపిక చేసిన పట్టణాలకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం : ఏఐఐబీ నిధులతో చేపట్టిన పనులపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం శీతకన్ను వేయటంతో పథకం లక్ష్యం నీరుగారిపోయింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఐదు పురపాలక సంఘాలకు ఏఐఐబీ రూ.319.32 కోట్లులను విడుదల చేసింది. ఇందులో పనులు చేపట్టిన గుత్తేదారులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదన్న ఆరోపణలున్నాయి. ఏఐబీబీ మొదటి విడత నిధులు విడుదల చేసినప్పటికీ గత ప్రభుత్వం ఏజెన్సీలకు చెల్లించలేదు. పనులు నిలిచిపోయాయి. వైఎస్సార్సీపీ నిర్లక్ష్యంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.
ఏఐఐబీ నిధులతో చేపట్టిన పనులు :బొబ్బిలిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సువర్ణముఖి నది నుంచి తాగునీటిని తీసుకొచ్చేందుకు రూ.94 కోట్లతో ఆరేళ్ల కిందట ఏఐఐబీ నిధులతో చేపట్టిన పథకానికి భూమిపూజ చేశారు. మూడేళ్ల క్రితం వైఎస్సార్సీపీ పాలనలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి కనీసం 10% పనులు కూడా పూర్తి చేయలేదు. చంపావతి నదిలో చేపట్టిన ఊటబావుల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.