YS Sharmila Fires on CM Jagan: అధికారవైఎస్సార్సీపీపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల పర్వం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి వివిద జిల్లాలో పర్యటనలు చేస్తున్న ఆమె, తాజాగా ప్రకాశం జిల్లాలో కార్యకర్తల సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్సార్‌సీపీ పార్టీకి షర్మిల కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఆ పార్టీ పేరుకు గతంలో ఉన్న అర్థం వేరని, ఇప్పుడున్న అర్థం వేరంటూ విమర్శించారు. ఇప్పుడున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేరని, వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమేనని ఆమె అభివర్ణించారు.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో విష్ణుప్రియ ఫంక్షన్ హాలులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ షర్మిల పాల్గొనగా, సీనియర్ నాయకులు రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజుతో పాటు పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. పులి కడుపునా పులే పుడుతుందని, తనలో ప్రవహిస్తోంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి రక్తమని షర్మిల అన్నారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చానని, తనను ఎవరూ ఏం చేయలేరని ఆమె తేల్చి చెప్పారు.
ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతుంటే మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారు: షర్మిల
ప్రజలను పట్టించుకోని పార్టీ వైఎస్సార్‌సీపీ: రాజశేఖరరెడ్డి ఆశయాలకు తిలోదకాలిస్తూ వైఎస్సార్‌సీపీ పార్టీ పాలనను కొనసాగిస్తోందని విమర్శించారు. మతతత్వ పార్టీ బీజేపీని రాజశేఖర రెడ్డి వ్యతిరేకించారని, అలాంటి పార్టీతో వైఎస్సార్‌సీపీ అంటకాగుతోందని షర్మిల అన్నారు. జగన్ రెడ్డి పార్టీ నియంత పార్టీ అని, ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేని పార్టీ అని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను తాకట్టుపెడుతోందని, స్టీల్ ప్లాంట్ పోతున్నా, పోలవరం నిర్వీర్యమైనా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.