YS SHARMILA COMMENTS : కర్నూలులో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల న్యాయయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగన్పై విమర్శల వర్షం కురిపిస్తోంది. కర్నూలుకు న్యాయరాజధాని అంటూ జగన్ కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రచారం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అఫిడవిట్ లో పేర్కొన్న అప్పుల అంశంపై వివిరణ ఇచ్చారు. అదే సమయంలో న్యాయం కోసం పోరాడుతున్న తమకు, తమ పిల్లలకు రేపు ఏమౌంతుందోనన్న ఆందోళనను షర్మిల వ్యక్తం చేశారు.
అప్పులపై అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు. నిజానికి చెల్లికి ఏ అన్న అయినా ఆస్తిలో వాటా ఇవ్వాలి, ఆడబిడ్డకు ఇవ్వాల్సిన హక్కు అన్నకు ఉందన్నారు. మేనమామగా కూడా అన్నకు బాధ్యత ఉందని షర్మిల పేర్కొన్నారు. కొందరు చెల్లికివ్వాల్సిన వాటాను కూడా తమదిగా భావిస్తారని విమర్శించారు. చెల్లెళ్లకు కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తనకు ఎలాంటి ఆస్తులు పంచారనేది కుటుంబం మొత్తానికి, దేవుడికీ తెలుసని షర్మిల వెల్లడించారు. తమ పోరాటం ఆస్తుల కోసం కాదు, న్యాయం కోసమని షర్మిల స్పష్టం చేశారు. రేపు మాకు, మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు, న్యాయం మొండిగా కోసం పోరాటం చేస్తున్నామని షర్మిల వెల్లడించారు.
కర్నూలు న్యాయ యాత్ర బహిరంగసభలో ప్రసగించిన షర్మిల, కర్నూలు న్యాయ రాజధాని పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. నేడు కర్నూలు, నందికొట్కూరు, నంద్యాలలో పర్యటిస్తున్నారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామన్నారని, కనీసం మంచినీళ్లు కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అని షర్మిల ప్రశ్నించారు. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే కర్నూలు వాసులకు నీళ్లు వచ్చేవన్న షర్మిల, ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని అన్నారు.