YS Sharmila Election Campaign: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా ముద్దనూరు పాత బస్టాండ్ వద్ద షర్మిల షర్మిల ప్రసంగించారు. రాముడికి లక్ష్మణుడు ఎలానో వైఎస్‌కు వివేకా అలాంటి వారని తెలిపారు. ఎప్పుడు, ఎక్కడికి పిలిచినా వివేకానందరెడ్డి వచ్చేవారని గుర్తు చేశారు. వివేకానే వెళ్లి సమస్య పరిష్కరించి వచ్చేవారని అన్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌కు వైఎస్ శంకుస్థాపన చేశారని, ఇంతవరకు దానిని పూర్తిచేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు దానిని శంకుస్థాపనల ప్రాజెక్టుగా మార్చేశారని దుయ్యబట్టారు.
అవినాష్ పాత్ర ఉందని సీబీఐ చెప్పింది:వివేకా హత్యలో అవినాష్ పాత్ర ఉందని స్వయానా సీబీఐ చెప్పిందన్న షర్మిల, ఇవాళ్టివరకు ఒక్కసారైనా అవినాష్‌ను జైలుకు పంపలేదని అన్నారు. నిందితులను సీఎం హోదాలో ఉన్న జగన్ కాపాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అధికారమిస్తే హంతకుడిని జగన్ కాపాడుతున్నారన్న షర్మిల, ఐదేళ్లుగా హంతకుడిని వెనకేసుకొస్తూనే ఉన్నారని విమర్శించారు.
ధర్మం ఎవరివైపు ఉందో చూసి ఓటు వేయాలి:నిందితుడు అవినాష్‌కే మళ్లీ టికెట్ ఇవ్వడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. ఎంపీగా వైఎస్ బిడ్డ కావాలో, హంతకుడు అవినాష్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేసే ముందు ధర్మం ఎవరివైపు ఉందో చూసి వేయాలని కోరారు. అభ్యర్థిగా అవినాష్‌ను మారుస్తారనే వార్తలు వస్తున్నాయన్న షర్మిల, అవినాష్‌ను మారుస్తున్నారంటే సీబీఐ చెప్పింది నిజమేనని నమ్ముతున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేయరు, అవినాష్ ఓడిపోతారని తెలిసే మారుస్తున్నారా అని నిలదీశారు. హత్యా రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో జగన్ చెప్పాలని అన్నారు.
వివేకా గొడ్డలి పోటుతో చనిపోతే, సాక్షి ఛానల్‌లో గుండెపోటు అని చిత్రీకరిస్తారా? అని ధ్వజమెత్తారు. గుండెపోటు అని ఎందుకు చిత్రీకరించారో జగన్ సమాధానం చెప్పాలన్న షర్మిల, ముందుగా సీబీఐ విచారణ కోరి సీఎం అయ్యాక ఎందుకు వద్దన్నారని ప్రశ్నించారు. హంతకులకు అధికారం ఉండకూడదనే తాను పోటీచేస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. ధర్మం వైపు ఉన్న తనను ఆశీర్వదించాలని కోరుతున్నానన్నారు.