YS Jagan Interesting Comments: ఎన్నికల ఫలితాల తరువాత గత వారం వైఎస్సార్సీపీ నేతలతో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగుచూశాయి. తాను అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనిపించిందని అన్నారు. కానీ మరి ఎందుకు వెళ్లలేదో తెలుసా?. దానికి కూడా జగన్ సమాధానం చెప్పారు. ఇంతకీ ఆ సమావేేశంలో జగన్ ఏం అన్నారో ఒకసారి ఇప్పుడు చూద్దాం.
‘ఎన్నికల రిజల్ట్స్ చూశాక షాక్ అయ్యా, ఇదేంటి, ఇంత చేస్తే ఈ ఫలితం ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఆలస్యంగా బయటికొచ్చాయి. ఫలితాలను చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి నేతలకు తెలిపే క్రమంలో జగన్ మోహన్ రెడ్డి ఈ మాటలు అన్నట్లు తెలిసింది.
ప్రతి ఇంటికి డబ్బులిచ్చాం- ప్రజలేంటో ఇలా చేశారు! ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా మారని జగన్ తీరు - Jagan met YSRCP Leaders
‘నిజంగానే హిమాలయాలకు వెళ్లిపోదామనే అనిపించింది. ఆ షాక్ నుంచి బయటకు రావడానికి రెండు మూడు రోజుల పైనే పట్టింది. కానీ, ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 40 శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి, అంటే అంత పెద్ద సంఖ్యలో ప్రజలు మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు. అది చూశాకనే మనం నిలబడాలి, మనకు ఓట్లు వేసిన ప్రజల కోసం పని చేయాలి అనిపించింది. దాంతోనే మెల్లగా ఎన్నికల ఫలితాల నుంచి బయటికొచ్చాను.
ఆ రిజల్ట్స్ ఎందుకు అలా వచ్చాయి అనేందుకు అనుమానాలు, కారణాలు ఏవి ఉన్నా, మనకు ఓట్లు వేసిన ప్రజల కోసం ముందు నిలబడాలి. సర్వేలు చేయించాము, వాటిలో ఎక్కడా కూడా వ్యతిరేకత రాలేదు. అందువల్లనే కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. కానీ ఫలితాలు మరోలా వచ్చాయి. వాటిని చూసినపుడు నా పరిస్థితే ఇలా ఉంటే, క్షేత్రస్థాయిలో మీకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నేను ఆ పరిస్థితి నుంచి బయటికి వచ్చినట్లే మీరు కూడా ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రండి. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం అవ్వండి’ అని నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై నెట్టింట తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
"అదేంటి, ఇక్కడ ఎందుకు ఉంది?"- మనుషులు, వస్తువులనూ నమ్మని మాజీ సీఎం - Ex CM YS Jagan 5 Years Ruling