Youths Performed Various Stunts On Bike At National Highway : ద్విచక్ర వాహనాలతో కొందరు యువకులు జాతీయ రహదారిపై రకరకాల విన్యాసాలు చేస్తూ హల్‌చల్ చేశారు. రహదారిపై వెళ్లే వాహనదారులను బెంబేలెత్తించారు. ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, పెనుకొండలోని బాబాయి స్వామి గంధం వేడుకలకు మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు హజరయ్యారు.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కొందరు యువకులు గంధం వేడుకలు ముగిసిన తర్వాత పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేశారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులను బెంబేలెత్తించారు. ఈ క్రమంలో ఓ రైడర్ కారును ఢీకొట్టాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సైరన్ మోగించుకుంటూ రావడంతో రైడర్లు పరుగులు తీశారు. జాతీయ రహదారిపై విన్యాసాలతో ఇతర వాహనదారుల్ని ఇబ్బందులకు గురి చేసిన రైడర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.