Youngsters Gets Gold medals in MBBS: అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఒకరు, కుటుంబ సభ్యుల కల సాకారం కోసం మరొకరు మంచి వైద్యులుగా పేరు తెచ్చుకోవాలని ఇంకొకరు వైద్య వృత్తిని ఎంచుకున్నారు. ఇలా వారి లక్ష్యం కోసం పక్కా ప్రణాళికతో సాధన చేశారు. ఎంబీబీఎస్, పీజీ వైద్య కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించి బంగారు పతకాలు గెలుపొందారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అధ్యాపకుల సహకారంతో ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకున్నారు.
డాక్టర్ కావాలనే పట్టుదల అపర్ణ అనే యువతిని లక్ష్యం వైపు నడిపించింది. ఎంబీబీఎస్ అనంతరం ఆప్తమాలజీలో ఎంఎస్ పూర్తి చేసింది. అనుకున్నది సాధించి గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకుంది. ప్రస్తుతం శంకర నేత్రాలయ ఆసుపత్రిలో ఫెలోషిప్ చేస్తోంది. పీజీలో బెస్ట్ అవుట్ గోయింగ్ విద్యార్థినిగా, రాష్ట్రంలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థినిగా రెండు బంగారు పతకాలు సాధించింది.
ప్రజలకు నాణ్యమైన సేవ అందించాలనే లక్ష్యంతో వైద్య వృత్తిని ఎంచుకున్నానని చెప్తోంది ప్రత్యూష. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఈమె ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం కేఎల్ఈ యూనివర్శిటీ, బెల్గాంలో పీజీ చదువుతోంది. ఎంబీబీఎస్‌లో అత్యధిక మార్కులతో పాటు బెస్ట్ అవుట్ గోయింగ్ విద్యార్థినిగా గుర్తింపు తెచ్చుకుంది. మొత్తం 6 బంగారు పతకాలు సాధించింది.
ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్డీ - కర్ణాటక గవర్నర్ నుంచి పట్టా అందుకున్న యువకుడు
మంచి వైద్యురాలిగా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతోనే కఠోర సాధన చేసింది సాధు పూజిత. కర్నూలుకు చెందిన పూజిత కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం అదే కళాశాలలో పీజీ డెర్మటాలజీ చివరి సంవత్సరం చదువుతోంది. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించి వైద్య విద్యలో సీటు సంపాదించటమే కాకుండా ఎంబీబీఎస్‌లో అత్యుత్తమ మార్కులు సాధించి 5బంగారు పతకాలను కైవసం చేసుకుంది.
సరైన సమయంలో వైద్య సదుపాయాలు లేక తన ఇంట్లో జరిగిన విషాదకర సంఘటనతో ఎలాగైనా డాక్టర్ కావాలని చిన్నప్పుడే నిశ్చయించుకున్నాడు సాయికృష్ణ. కామరెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సాయి దంత వైద్య విభాగంలో హెడ్ అండ్ నెక్ సర్జన్ కావటమే తన ధ్యేయమని చెబుతున్నాడు. నోటి కాన్సర్‌తో చాలా మంది మృతి చెందుతుండటంతో దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. దంత వైద్యులంటే కేవలం దంత సంరక్షణ మాత్రమే కాదని, క్యాన్సర్ లాంటి మహమ్మారిని సైతం నయం చేస్తారని నిరూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
సమాజంలో వైద్యులది కీలక పాత్ర అని, ఈ వృత్తి ఎంచుకోవాలనుకునే వారు ప్రారంభం నుంచే ప్రణాళికతో అడుగేస్తే విజయం సాధించవచ్చని చెప్తున్నారు ఈ యువత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఆరోగ్య పథకాలు ప్రవేశపెట్టినా అవి పేద ప్రజల వరకు చేరుకోవట్లేదని, వాటిపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
జీఎంఆర్ ఐటీ వేదికగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీలు - ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు
ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులు- గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాలు