Young Man Attacked a Girl with Knife in Bapatla District:సమాజంలో రోజురోజుకూ ఆడవారిపై అరాచకాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రేమించమని వెంటపడుతూ బెదిరిస్తూ వేధింపులకు గురి చేస్తారు కొందరు. ప్రేమ అంగీకరించకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు మరికొందరు. అమ్మాయి దక్కలేదనే కక్షతో పలుమార్లు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆ ఉన్మాదంలో ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా ఇలాంటి ఘటనే బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.
3 గంటలకు ఇంటికెళ్లి గొడవ: జిల్లాలోని చెరుకుపల్లి మండలం కనగాలలో ప్రేమోన్మాది బరితెగించాడు. తన ప్రేమను అంగీకరించడం లేదంటూ బాలిక ఇంటికెళ్లి మరీ చాకుతో దాడికి తెగబడ్డాడు. చెరుకుపల్లిలోని ఓ స్కూల్లో చదువుతున్న బాలిక వెంటపడుతున్న రాజోలు భార్గవరెడ్డి పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా వేధిస్తున్నాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఈ తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికెళ్లి గొడవ చేశాడు. వెంట తెచ్చుకున్న చాకుతో బాలికపై దాడి చేశాడు. అడ్డువచ్చిన బాలిక తల్లిదండ్రులనూ దారుణంగా పొడిచాడు. తీవ్ర గాయాలైన ముగ్గురినీ రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.