YCP MLA Occupied 100 Acre Pond:మన ప్రభుత్వంలో చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా శిక్షించాలని, ఎక్కడా అన్యాయం జరగదని సీఎం జగన్ మహా గొప్పగా చెప్తుంటారు. కానీ ఇవేమీ అధికార పార్టీ నాయకులకు వర్తించనట్లు వ్యవహరిస్తున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడం, ప్రభుత్వ స్థలాలను గుట్టుచప్పుడు కాకుండా అధికారులను అడ్డం పెట్టుకుని మింగేయడం, అధికారంలో ఉండగానే అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంతో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా దోపిడీకి తెగబడుతున్నారు. పార్కులు, అత్యంత విలువైన కూడలిలోని స్థలాలు, బళ్లూ, ఆలయ స్థలాలు, చెరువులు అనే తేడా లేకుందా అందిన కాడికి దోచుకుంటున్నారు.
రెవెన్యూ అధికారులను బుట్టలో వేసుకుని దొంగపత్రాలు సృష్టించి కాజేస్తున్నారు. వారి అక్రమాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు దాడులకు తెగబడి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఫలితంగా కోట్లు విలువ చేసే స్థలాలు అధికార పార్టీ నేతల పరమవుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంట చెరువును కబ్జా చేసి తన విలాసాలకు వాడుకుంటున్నారని రాష్ట్ర ఓబీసీ పోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ ఆరోపించారు.
సకుటుంబ స'మేత' పర్వం - దోపిడీలో పతిని మించిన సతి, ఇసుక మేస్తున్న పుత్రరత్నం
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో సుమారు 100 ఎకరాల చెరువు కనిపించకుండా పోయిందని వెతికి పెట్టాలంటూ రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ వరకు 'చెరువు చెరువు ఎక్కడున్నావ్, చెరువు మిస్సింగ్' అంటూ ప్లకార్డులు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధా యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూ. 100 కోట్ల నిధులు ఆ చెరువులో ఖర్చు చేశారని ఆరోపించారు.