ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవినీతి కొట్టు- పక్కా 'ప్లానింగ్​'తో కోట్లు కొల్లగొడుతున్న తండ్రీకొడుకులు - YCP Leader Irregularities - YCP LEADER IRREGULARITIES

YCP Leader Irregularities in joint West Godavari District: ఆ నేత పేరు వింటేనే 'నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు' అనే పాట గుర్తొస్తుంది. అవినీతి సొమ్ము దంచి కొట్టుడులో ఆయనకు ఆయనే సాటి. దైవభక్తి ఎక్కువ అని నీతులు వల్లె వేస్తూ దేవుళ్ల లాంటి ప్రజల నుంచి డబ్బు పిండుకోవడంలో సిద్ధహస్తుడాయన. "డబ్బు కొట్టు-ఇల్లు కట్టు" పథకంతో కోట్లు కొల్లగొడుతున్నారు. ఆయన పుత్రరత్నానిదీ అవినీతి బాటే. తండ్రీకొడుకులిద్దరూ వేర్వేరుగా కౌంటర్లు తెరిచి అక్రమార్జన సాగిస్తున్నారు. బాణసంచా నుంచి బడా వ్యాపారి వరకు ఎవరిస్థాయిలో వారు వాళ్లకు ముడుపులు సమర్పించుకోవాల్సిందే.

ycp_leader_irregularities
ycp_leader_irregularities

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 11:13 AM IST

YCP Leader Irregularities in joint West Godavari District:అది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మధ్యలో జాతీయ రహదారిని ఆనుకుని ఉండే ప్రాంతం. ఇటు డెల్టా అటు మెట్ట నేలల అనుసంధానంగా ఉన్న ఈ ప్రాంతం హోల్‌సేల్‌ ఉల్లి వ్యాపారానికి ప్రసిద్ధి. అపరాల వ్యాపారమూ ఎక్కువే. రాష్ట్రంలో కీలకస్థానంలో ఉండి అక్కడ ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న ఆ నాయకుడి స్టైలే వేరు. ఆయన కుటుంబంలోని ఒకరు మహానగరంలో బడా వ్యాపారంలో చక్రం తిప్పుతూ కార్పొరేట్‌ స్థాయి వ్యవహారాలు చక్కదిద్దుతుంటారు. ఆ మంత్రాంగంతోనే ఈ నేతకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కిందనే ప్రచారమూ ఉంది. ఆయన ఆజ్ఞలేనిదే పట్టణ ప్రణాళిక విభాగంలో ఒక్క ఫైలు కూడా కదలదు.

అంతా ప్లానింగ్ ప్రకారమే: ఇల్లు కట్టాలన్నా, భవనం నిర్మించాలన్నా ముందు ఆయనకు ముడుపులు ముట్టాకే పునాది రాయి వేసుకోవాలి లేదంటే ఉన్న పునాదులే కదులుతాయి. నిర్మాణ అనుమతుల కోసం ముందు ఆ ప్రజాప్రతినిధిని దర్శించుకోవాలని స్వయంగా అధికారులే సలహా ఇస్తారు. నాయకుడి అనుచరులు కూడా పట్టణంలో తిరుగుతూ భవన నిర్మాణ అనుమతులు తీసుకున్నారో లేదో ఆరా తీస్తుంటారు. అనుమతులు తీసుకుకుండా తమ నాయకుడికి కప్పం కట్టకుండా ఎవరైనా ఉంటే వాళ్లపైకి అధికారులను ఉసిగొల్పుతారు.

నిబంధనల ప్రకారం ఉంటే పురపాలక సంఘాలు లే-అవుట్లకు అనుమతులు జారీ చేస్తాయి. ఆ ప్రజాప్రతినిధికి ఓ 50 లక్షలు సమర్పించుకుంటేచాలు నిబంధనలు పాటించకపోయినా అనుమతులు వచ్చేస్తాయి. స్థలాన్ని బట్టి 5 నుంచి 10 లక్షల వరకూ ముడుపులు ముట్టజెప్పాల్సిందే. కొన్ని రోజుల క్రితం పట్టణంలో అక్రమ లే-అవుట్‌ వేసిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఆ ప్రజాప్రతినిధికి 40 లక్షలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అన్ని అనుమతులు తీసుకుని గృహ సముదాయాల నిర్మాణాలు చేపట్టిన మరో సంస్థకు కూడా నేత నుంచి కబురు అందింది. అంతా బాగుంది కానీ పక్కనే కంపోస్టు యార్డ్ వస్తే పరిస్థితేంటో ఆలోచించుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. ఎందుకొచ్చిన గొడవలే అనుకున్న నిర్మాణ సంస్థ సదరు ప్రజాప్రతినిధిని లక్షల రూపాయలతో సంతృప్తిపరిచింది.

'ఈ దాహం తీరనిది!' వచ్చే ఏడాది అప్పులూ ఇప్పుడే- ₹20వేల కోట్ల రుణానికి జగన్​ సిద్ధం - YCP govt take loans

సొంత పార్టీ నాయకుడు కూడా డబ్బులివ్వాల్సిందే:పట్టణంలో రాష్ట్రస్థాయి విద్యాసంస్థకు వెళ్లే మార్గంలో పట్టణ బృహత్తర ప్రణాళికలో 80 అడుగుల రోడ్డు ఉంది. ఆ రోడ్డుకు ఇరువైపులా పేదలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ వెనకాలే ఓ ప్రముఖ వ్యాపార సంస్థకు స్థలం ఉంది. అడ్డుగా ఉన్న ఆ నివాసాలను తొలగించేందుకు నాయకుడు ఆ సంస్థ నుంచి అక్షరాల 2 కోట్లు దండుకున్నారు. తర్వాత అలా ఖాళీ చేయించిన స్థలాన్ని సదరు వ్యాపార సంస్థ పార్కింగుకు వాడుకుంటోంది. నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని గ్రామంలో సొంత పార్టీ నాయకుడే ఓ కల్యాణ మండపాన్ని నిర్మించాలనుకున్నాడు. ఇందుకు అధికారులు అనుమతులు ఇవ్వకుండా ప్రజాప్రతినిధి అడ్డుకున్నారు. ఆయనకు డబ్బులు సమర్పించుకున్న తర్వాతే అనుమతులు జారీ అయ్యాయి. ఇలా సొంత పార్టీ నాయకుడిని కూడా పిండేశారు.

తండ్రీకొడుకుల కౌంటర్లు వేరే: తండ్రికి తగ్గట్టుగానే ప్రజాప్రతినిధి కుమారుడు కూడా చేతివాటం చూపుతున్నారు. పట్టణంలోని ఓ కుటుంబం తమ స్థలంలో భవన నిర్మాణానికి ఓ బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత నిర్మాణం పూర్తిచేయకుండా ఇబ్బంది పెడుతుండటంతో ఆ కుటుంబం సమస్యను ప్రజాప్రతినిధి కుమారుడి వద్దకు తీసుకెళ్లింది. ప్రతిఫలంగా ఆయన అడిగిన మొత్తాన్ని సమర్పించుకుంది. మొదట పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండని, పోలీసులకు చెప్పి అంతా తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. కానీ బాధిత కుటుంబం స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా కేసు మాత్రం నమోదు కాలేదు. ఇందుకు కారణం ఏంటని ఆరా తీస్తే బిల్డర్‌ అప్పటికే ప్రజాప్రతినిధికి డబ్బులు ముట్టజెప్పి కేసు నమోదుకాకుండా పోలీసులను ‘మేనేజ్‌’ చేసుకున్నారని తెలిసింది. అంటే తండ్రి ఒక కౌంటర్, కుమారుడు మరో కౌంటర్‌ నిర్వహిస్తున్నాడని అప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది.

ఇందూ- హౌసింగ్ బోర్డు కేసులో వైవీపై సృష్టమైన ఆధారాలున్నాయి : తెలంగాణ హైకోర్టు - MP YV SUBBAREDDY

టీడీఆర్‌ బాండ్లలో అక్రమాల లీలలు: రాష్ట్రంలో టీడీఆర్‌ బాండ్లలో సాగిన అక్రమాల లీలలు ఇన్నీఅన్ని కావు. ఇక్కడి సమీపంలోని మరో పట్టణానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి టీడీఆర్‌ బాండ్ల అక్రమాలకే బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రభావం ఈ నేతపైన కూడా పడింది. 80 అడుగులు ఉన్న నల్లజర్ల-కోడేరు రహదారిని 100 అడుగులకు విస్తరించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా 3 వేల చదరపు గజాలకు బాండ్లు జారీ చేశారు. ఆ స్థలం విలువను 18 కోట్లుగా లెక్కగట్టి అందుకు నాలుగు రెట్ల విలువైన బాండ్లు విడుదల చేశారు. అక్కడ ఉన్న వాస్తవ విలువను పెంచి బాండ్లు జారీ చేయడం ఒక తప్పిదం అయితే ఆ స్థలాలు స్వాధీనం చేసుకోకుండానే బాండ్లు ఇవ్వడం మరో తప్పిదం. అనంతరం ఈ బాండ్లను వారే అమ్మేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజాప్రతినిధి కీలకపాత్ర పోషించి కోట్లను కొల్లగొట్టారు.

వ్యాపారుల నుంచి లక్షల్లో వసూలు: నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో గ్రావెల్‌ నిక్షేపాలు ఉన్నాయి. వ్యాపారులు కొంతమేరకు అనుమతులు తీసుకుని ఇష్టారాజ్యంగా మట్టి తవ్వుతున్నారు. అనుమతులు లేని ప్రాంతాల్లో యంత్రాలతో అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్నారు. అందుకు ప్రజాప్రతినిధికి లక్షల్లో కప్పం చెల్లిస్తున్నారు. ఈ నియోజకవర్గ ప్రాంతం బాణసంచా వ్యాపారానికి ప్రసిద్ధి. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని రిటైల్‌ వ్యాపారులకు టపాకాయలు సరఫరా అవుతుంటాయి. ప్రతి దీపావళికి ఇక్కడ కోట్లలో వ్యాపారం సాగుతుంది. దీపావళి వచ్చిందంటే వ్యాపారుల నుంచి ముక్కుపిండి మరీ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తారు. గత దీపావళి సమయంలో వ్యాపారులందరిని తన ఇంటికి పిలిపించుకుని ఒక్కో వ్యాపారి 5 లక్షల చొప్పున ఇస్తేనే బాణసంచా అమ్మకాలు చేయిస్తానని తెగేసి చెప్పారు.

అవినీతి కొట్టు- పక్కా 'ప్లానింగ్​'తో కోట్లు కొల్లగొడుతున్న తండ్రీకొడుకులు

నిరసనలు, ఆందోళనలతో జగన్ బస్సు యాత్ర! సభకు వచ్చిన వారికి డబ్బులు- వీడియోకు చిక్కిన వైసీపీ నేతలు - ys jagan memantha siddham bus yatra

నిరుద్యోగుల నుంచి వసూళ్లు:ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రజాప్రతినిధి అనుచరుడు నిరుద్యోగుల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేశారు. నిట్, ఉద్యానవర్సిటీ, ఇతర విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి 10 లక్షల వరకు వసూళ్లకు తెగబడ్డారు. వసూలు చేసిన మొత్తంలోంచి సగానికి పైగా ప్రజాప్రతినిధికి అందినట్లు సమాచారం. డబ్బులు ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగాల ఊసు లేకపోవడం నిరుద్యోగులంతా అనుచరుడిపై ఒత్తిడి చేశారు. ప్రజాప్రతినిధిని కూడా కలిశారు. చివరికి తనకేం సంబంధం లేదని లేదని ఆ నాయకుడు చేతులు ఎత్తేశారు. దీంతో అనుచరుడు ప్రజాప్రతినిధికి ఇచ్చిన సొమ్మును సర్దుబాటు చేయలేక సతమతమవుతున్నారు. ఇలా అన్నింటిల్లోనూ ఆ నేత చిలక్కొట్టుడుతో అడిగినంత సమర్పించుకుని మిన్నకుండటమే ప్రజల వంతుగా మారింది.

ABOUT THE AUTHOR

...view details