ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైసీపీ పాలనలో అన్ని రంగాలు లాస్ట్​ - డ్రగ్స్​ స్మగ్లింగ్​లో దేశంలోనే టాప్​ - DRUGS SMUGGLING IN AP - DRUGS SMUGGLING IN AP

Ganja Smuggling in AP: ఒక దేశ భవిష్యత్తుకు వెన్నెముక యువత. నాణ్యమైన మానవ వనరులుగా మారి ప్రగతిలో యువత భాగస్వామ్యమైతేనే దేశం మరింత ముందుకు సాగుతుంది. అయితే అలాంటి యువత రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి బారిన పడి చిక్కిశల్యం అవుతోంది. బంగారు భవిష్యత్తును బలి చేసుకుంటోంది. అయిదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యమే ఇందుకు కారణం.

Ganja_Smuggling_in_AP
Ganja_Smuggling_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 12:59 PM IST

వైసీపీ పాలనలో అన్ని రంగాలు లాస్ట్​ - డ్రగ్స్​ స్మగ్లింగ్​లో దేశంలోనే టాప్​

Ganja Smuggling in AP:ప్రభుత్వ నిర్లిప్తత కారణంగా ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. బాలల్లో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 12వ స్థానానికి చేరింది. మూడు రోజుల క్రితం విశాఖపట్నం పోర్టులో వేల కోట్ల రూపాయల విలువైన వేల కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడడం రాష్ట్రం పరువును మరోసారి గంగలో కలిసేలా చేసింది. మరి రాష్ట్రానికి ఏమిటి ఈ దుర్గతి. పట్టించుకోవాల్సిన జగన్‌ ప్రభుత్వం ఏం చేస్తోంది. రాష్ట్రం భవిష్యత్తు ఏం కానుంది.

పాదయాత్రలో భాగంగా ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే రాష్ట్రం ఇక బంగారుమయమే అన్నారు. ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టారు. జగనన్న ఏదో చేస్తారని భ్రమపడ్డారు. అయిదేళ్ల పాలన చివరి దశకు వచ్చింది. ఇన్నేళ్ల పాలనను తరచి చూస్తే ఏముంది. ఏమీలేదు అంతా గుండుసున్నా. బటన్‌లు నొక్కడం తప్ప అభివృద్ధి భూతద్దంతో వెతికినా కనిపించదు. అన్నింటా రాష్ట్రం అధోగతే. అయితే ఒక్క విషయంలో మాత్రం రాష్ట్రం ముందువరుసలో నిలిచింది.

అయితే ఆ ఘనతను చూస్తే రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిందే. జగనన్న పాలనలో ఆంధ్రప్రదేశ్‌ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌లో ముందంజలో నిలిచింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విడుదల చేసిన నివేదికల్లో మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉంటోంది. గత కొన్ని సంవత్సరాల గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయంలో నివ్వెరపోయే వాస్తవాలు బయటపడ్డాయి.

పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ విదేశీయుడు - సంధ్య ఆక్వా పరిశ్రమకు రావటంపై అనుమానాలు - Foreigner Caught with Cash

2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పట్టుబడిన మాదకద్రవ్యాల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే లభించాయి. కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని డీఆర్​ఐ అధికారులు దేశవ్యాప్తంగా 34వేల 2కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోగా, అందులో సగం కంటే ఎక్కువ అంటే 18వేల 267కిలోలు ఆంధ్రప్రదేశ్‌లోనే లభించాయి. పట్టుకున్న వాటిలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఉన్నాయి. స్మగ్లింగ్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక 2021-22 ఈ విషయాలను వెల్లడించింది.

అత్యధికంగా మాదకద్రవ్యాలు పట్టుబడిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ తర్వాత త్రిపుర, అసోం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అసోంలో 5వందల మంది పట్టుబడగా, ఆ తర్వాత 90మందితో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. గంజాయి వినియోగంలోనూ ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ముందంజలో నిలిచింది. గంజాయి అత్యధికంగా పట్టుబడిన రాష్ట్రాల జాబితాలో 2019, 2021లో ఏపీ మొదటి స్థానంలో నిలవగా, 2020లో రెండో స్థానంలో నిలిచింది.

'సంధ్యా ఆక్వా' బస్సులో దొరికిన వస్తువులను సీబీఐకి ఎందుకు ఇవ్వలేదు: పట్టాభి - Pattabhi Ram on Sandhya Aqua Bus

మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పని చేసే నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో 2021లో దేశవ్యాప్తంగా 7లక్షల 49వేల 761కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, అందులో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 2లక్షల 588కిలోలు పట్టుబడింది. 2020లో దేశవ్యాప్తంగా 5లక్షల 81వేల 644కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, అందులో ఆంధ్రప్రదేశ్‌లో 97వేల 826కిలోలు లభించాయి. 2019లో దేశంలో 3లక్షల 42వేల 44కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోగా, అందులో ఆంధ్రప్రదేశ్‌లో 70వేల 229కేజీలు ఆంధ్రప్రదేశ్‌లోనే లభ్యమైంది.

రాష్ట్రంలో గంజాయికి బానిసైన వారు 4లక్షల 64వేల మంది ఉన్నారు. అందులో 21వేల మంది 10 నుంచి 17ఏళ్ల లోపు వారే. బాలల్లో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 12వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 20.19లక్షల మంది మాదకద్రవ్యాల వ్యసనపరులు ఉండగా, అందులో 3.17లక్షల మంది బాలలే. రాష్ట్రంలో జగన్‌ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి డీఆర్​ఐ, ఎన్​సీబీ, పోలీసు, సెబ్‌ తదితర విభాగాలన్నీ కలిపి 5లక్షల 33వేల 620కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి.

ప్రస్తుతం ఏపీలో కిలో గంజాయి 6వేల రూపాయల వరకు పలుకుతోంది. ఇతర రాష్ట్రాల్లో అది 10నుంచి 15వేల రూపాయల వరకు ఉంది. ఈ లెక్కన నాలుగేళ్లలో పట్టుబడిన గంజాయి విలువే 8వందల కోట్ల రూపాయలపైనే ఉంటుంది. విశాఖ మన్యం నుంచి ప్రతి సంవత్సరం లక్షల కిలోల గంజాయి ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. అందులో పట్టుబడుతున్నది 2శాతం కూడా లేదు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువే ఇన్ని వందల కోట్ల రూపాయలు ఉందంటే పోలీసుల కళ్లుగప్పి తరలిపోతున్నది కూడా లెక్కిస్తే ఈ స్మగ్లింగ్‌ రాకెట్‌ ఎంత భారీగా విస్తరించిందో అర్థం అవుతుంది.

విశాఖకు కంటెయినర్‌లో వచ్చింది డ్రగ్సే - సీబీఐ నివేదికలో వెల్లడి - Visakhapatnam Drugs Case

ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న మాదకద్రవ్యాల దందాలో అధికార వైసీపీ నేతలకు కూడా పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పలువురు వైసీపీ నేతల బంధువులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే వీరికి ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్‌ మూలాలు అంతర్జాతీయ స్థాయికి కూడా విస్తరించాయి. రెండేళ్ల క్రితం విజయవాడ చిరునామాతో అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చిన వేల కోట్ల రూపాయల హెరాయిన్‌ గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో పట్టుబడడం సంచలనం సృష్టించింది.

అయితే దాన్ని మించిన సంచలన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నం పోర్టుకు లక్షల కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాల కంటైనర్‌ రావడం పెను సంచలనానికి దారి తీసింది. రెండేళ్ల క్రితం పట్టుబడ్డ డ్రగ్స్‌ విలువ 21వేల కోట్ల రూపాయలు ఉంటుందని లెక్కగట్టారు. అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చిన కంటెయినర్లు విజయవాడకు చెందిన ఓ సంస్థకు చెందినవిగా గుర్తించారు. టాల్కమ్‌ పౌడర్‌ ముసుగులో డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్నట్లు తేలింది. అది రాష్ట్రంలోని ఓ వైసీపీ నేత బినామీకి చెందిన కంపెనీ అని ఆరోపణలు వచ్చాయి.

ప్రస్తుతం విశాఖలో డ్రగ్స్‌ కంటెయినర్‌ పట్టుబడిన వ్యవహారంలోనూ వైసీపీ నేతలపై ఆరోపణలు వస్తున్నాయి. పట్టబడిన డ్రగ్స్‌ కంటెయినర్‌ సంస్థ సంధ్య ఆక్వా కంపెనీ కొవిడ్‌ సమయంలో సీఎం సహాయ నిధికి 50లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. విశాఖ పోర్టుకు మార్చి 16న చేరిన కంటెయినర్‌ను తెరిచేందుకు సీబీఐ ప్రయత్నించగా వైసీపీ నేతలు ఆటంకాలు కల్గించినట్లు తెలిసింది. వైసీపీ పెద్దల ఒత్తిళ్లతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాలను ఉపయోగించి కంటెయినర్‌ను తెరవకుండా ప్రయత్నించినట్లు సమాచారం.

కంటెయినర్‌ను తెరిచి నమూనాలు సేకరించి పరీక్షించే సమయంలోనూ సహకరించాల్సిన అధికారులు అడ్డంకులు సృష్టించినట్లు తెలిసింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి సంధ్యా ఆక్వా కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు సన్నిహితుడు అనే అంశం సామాజిక మాధ్యమాల వేదికగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండలం ఈదులమూడికి చెందిన ఈయన కుటుంబం వైసీపీలో ఉంది. ఈయన సోదరుడు పూర్ణచంద్రరావును సహకార పరపతి సంఘం ఛైర్మన్‌గా వైసీపీ ప్రభుత్వమే నియమించింది.

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ- ఇప్పుడు డ్రగ్స్‌ క్యాపిటల్​గా మార్చేశారు: వైఎస్ షర్మిల రెడ్డి - Sharmila on Visakha Drug Case

విశాఖలో ఇప్పుడు డ్రగ్స్‌ కంటెయినర్‌ పట్టుబడడం సంచలనం సృష్టించినా అయిదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రం అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలకు గమ్యస్థానంగా, కార్యక్షేత్రంగా మారింది. విదేశాల నుంచి టన్నుల కొద్ది నిషేధిత మత్తు పదార్థాలు నేరుగా రాష్ట్రంలోకి దిగుమతి అవుతున్నాయి. ఇతర పదార్థాల్లో ఈ మాదకద్రవ్యాలను కలిపి ఇక్కడికి తీసుకువస్తున్నారు. వాటిని ప్రాసెస్‌ చేసి మాదకద్రవ్యాలను వెలికి తీసి మార్కెట్‌లోకి పంపిస్తున్నారు.

లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ వ్యవస్థీకృత దందా అయిదేళ్ల జగన్‌ పాలనలో విస్తృతంగా సాగింది. ఏపీలోకి సరుకు తరలిస్తే నిఘా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు పట్టించుకోవు అన్న ధీమాతో స్మగ్లర్లు ధీమాగా ఉంటున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే డ్రగ్స్‌కు కీలక అడ్డగా మారిపోయింది. రాష్ట్రంలో పలువురు వైసీపీ నేతలే డ్రగ్స్‌ దందా చేస్తారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అడ్డుకోవాల్సిన జగన్‌ పట్టించుకోరు. యువత డ్రగ్స్‌ మత్తులో ఊగుతున్నా నిర్లక్ష్యం వహిస్తారు.

రాష్ట్రం పరువు అంతర్జాతీయ స్థాయిలో గంగలో కలుస్తున్నా పట్టింపే ఉండదు. అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనకపడేసిన జగన్‌ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌లో మాత్రం దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిపి తనదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఇక రాష్ట్రం భవిష్యత్తు ఏమిటి అన్నది ఇక కాలమే నిర్ణయించాలి.

ABOUT THE AUTHOR

...view details