YCP Government Violated Election Code :రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా అడుగడుగునా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా వైసీపీ జెండాలు, నేతల ఫ్లెక్సీలు అలాగే దర్శనమిస్తున్నాయి.వైయస్‌ఆర్ జిల్లా మైదుకూరులో వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. కేవలం సభ నిర్వహణకు అనుమతి తీసుకున్న నాయకులు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లకు వైసీపీ జెండాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. డీజే శబ్ధాలు చేస్తూ బాణసంచా కాల్చారు. ర్యాలీలో అడ్డదిడ్డంగా వాహనాలు నడపడంతో మైదుకూరు పట్టణంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యకు దారి తీసింది. పట్టణంలో 167బి జాతీయ రహదారిపై దాదాపు గంటన్నర సేపు ట్రాఫిక్ స్తంభించింది.
వైసీపీ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు - ఇద్దరిపై ఈసీ వేటు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలో ఈసీ నిబంధనలు ఉల్లఘించి అధికార పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 16 మంది వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. అంబాజీపేట మండలంలోని ముసలపల్లి, ఇరుసుమండ, వాకలగరువు గ్రామాల్లో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభల్లో పాల్గొన్న 16 మంది వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఇంఛార్జి MPDO లక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన సిద్ధం గ్రామసభల్లో వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఈనాడులో 'వద్దంటే వినరే, వైసీపీ సైన్యం బరితెగింపు' అనే శీర్షికలతో కథనాలు ప్రచురించారు. కథనాలకు స్పందించిన అధికారులు వాలంటీర్లను సస్పెండ్ చేశారు.
Code Violation in Srikakulam District : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని లొద్దపుట్టి కూడలి వద్ద ఉన్న ప్రజా సంకల్ప యాత్ర ముగింపు పైలాన్ వద్ద జగన్ ఫొటోలకు ఇప్పటికి ముసుగు పడలేదు. కోడ్ అమల్లోకి రావడంతో నిబంధనల ప్రకారం వీటిని కప్పి ఉంచాలి. కానీ ఇక్కడ అలాంటి చర్యలు చేపట్టకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ముదిరిన వైసీపీ ప్రచార పిచ్చి - కేంద్ర పథకాలకు పార్టీ రంగులు
వ్యవస్థలను స్వలాభానికి వాడుకోవడంలో జగన్ రెడ్డి సైన్యానికి మించిన వారు లేరు. ఎన్నికల కోడ్ వచ్చినా, బేఖాతర్ అంటూ పార్టీ రంగుల పిచ్చిని పరాకాష్టకు తీసుకెళ్తున్నారు. వైసీపీ చేష్టలకు అధికారులు సైతం వంతు పాడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలకు వైఎస్సార్సీపీ రంగు వేసి ప్రచారానికి వాడుకున్నారు. కోర్టులు చివాట్లు పెట్టినా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి నిబంధన ప్రకారం పార్టీ రంగులు, ఆయా పార్టీలకు చెందిన నాయకుల విగ్రహాలు, అధికార ప్రతినిధులు ఫొటోలు వంటివి ఉండకూడదు. కానీ ప్రకాశం జిల్లాలో రంగులు తొలగించకుండా అలాగే వదిలేశారు. అలాగే జిల్లాలోని పార్క్ చుట్టూ ఉన్న కంచెకు ఎన్నికల కోడ్ వచ్చినా వైసీపీ రంగులు వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్ సర్కార్ ఎంతకు తెగించిందో అర్థమవుతుంది.