Wreckage of Pakistan Submarine PNS Ghazi in Vizag: విశాఖ తీరంలో పాకిస్థాన్ జలాంతర్గామి శకలాలను తాజాగా భారత నౌకాదళం అత్యాధునిక టెక్నాలిజీని ఉపయోగించి గుర్తించింది. 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి దొంగచాటుగా ప్రవేశించిన పీఎన్‌ఎస్ ఘాజీ (PNS Ghazi)కి చెందినవిగా వీటిని తేల్చారు. ఈ విషయాన్ని మన నౌకాదళంలోని సబ్‌మెరైన్ రెస్క్యూ విభాగానికి చెందిన ఏ సీనియర్ అధికారి తెలిపారు.
భారత అమ్ములపొదిలోకి సరికొత్తగా చేరిన డీఎస్‌ఆర్‌వీ (Deep Submergence Rescue Vehicle) సాయంతో వీటిని కనుగొన్నామన్నారు. విశాఖ తీరానికి కేవలం కొన్ని నాటికల్ మైళ్ల దూరంలోనే సముద్ర గర్భాన ఇవి పడి ఉన్నాయని పేర్కొన్నారు. యుద్ధంలో చనిపోయిన వారిని గౌరవించడం మన నౌకాదళ ఆచారమని, అందుకనే ఆ శకలాలను తాకలేదని ఆయన తెలిపారు. తీరానికి 2 నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో 100 మీటర్ల లోతున ఇవి ఉన్నట్లు తెలుస్తోంది.
సబ్‌మెరైన్‌తో సముద్రంలో ద్వారక నగర వీక్షణ- 300 అడుగుల లోతుకు వెళ్లి
డీఎస్‌ఆర్‌వీ టెక్నాలజీ ప్రత్యేకత:సముద్ర గర్భం చాలా కఠినమైనది. సబ్‌మెరైన్ల ప్రయాణం అనేక సవాళ్లతో కూడుకున్న విషయం. అందుకే జలాల కింద ఉపరితలం ఎలా ఉంటుందో అంచనావేసి, మన జలాంతర్గాములు (Submarines) ప్రయాణించేందుకు అనువైన మార్గాలను డీఎస్ఆర్‌వీ సాయంతో మ్యాపింగ్ చేస్తారు. విశాఖలో సముద్రం సగటున 16 మీటర్ల లోతు ఉంటుంది. ఇది ఓడలు నిలిపేందుకు అనుకూలమైనది. అంతేకాకుండా జలాంతర్గాములు తీరం సమీపంలోకి వచ్చి వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను చూసే 1971 సంవత్సరంలో పీఎన్‌ఎస్ ఘాజీ విశాఖ తీరానికి చేరి నక్కింది.
2013వ సంవత్సరంలో ఐఎన్‌ఎస్ సింధ్‌రక్షక్ (INS Sindhurakshak) ప్రమాదానికి గురై 13 మంది మరణించడంతో భారత్ నేవీ ఆలోచనలో పడింది. ఇటువంటి సమయంలో సిబ్బందిని రక్షించేందుకు వీలుగా 2018లో తొలిసారి డీఎస్‌ఆర్‌వీ టెక్నాలజీని తీసుకొచ్చింది. ప్రమాదానికి గురైన నౌకలు, జలాంతర్గాములను గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు డీఎస్ఆర్వీని వాడాలని నిర్ణయించింది. ప్రస్తుతం మన వద్ద రెండు డీఎస్‌ఆర్‌వీలు ఉండగా అందులో ఒకటి తూర్పు, మరొకటి పశ్చిమ తీరంలో వాడుతున్నారు. అదే విధంగా వీటిని నౌకలు లేదా విమానాల్లో తరలించవచ్చు. ఇటువంటి టెక్నాలిజీ ప్రపంచంలో ప్రస్తుతం భారత్ సహా 12 దేశాల వద్ద మాత్రమే ఉంది. సముద్ర గర్భం లోతుకు వెళ్లే కొద్దీ ఒత్తిడి భారీగా పెరుగుతుంది. అయితే డీఎస్‌ఆర్‌వీకి మాత్రం 650 మీటర్ల దిగువకు వెళ్లి పనిచేసే సామర్థ్యం ఉంది. వైజాగ్‌లోని హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లో (Hindustan Shipyard) ఇలాంటివి మరో రెండింటిని దేశీయంగా తయారు చేయడంపై భారత్ దృష్టిపెట్టింది.