Womanin 6th World Telugu Writers Mahasabha Vijayawada :ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళా రచయితలు, కవులు, భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు పరిరక్షణ అందరి బాధ్యత అని నినదించారు. ముందు తరాలకు తెలుగును అందించాల్సిన గురుతర బాధ్యత కూడా మనందరిపై ఉందని పేర్కొన్నారు. అందుకే ఎక్కడ తెలుగు భాషపై సదస్సులు జరిగినా కష్టనష్టాలకోర్చి మరీ వెళ్తామని వెల్లడించారు. మాతృభాష వల్లే మనకు తెలుగు వారనే గుర్తింపు ఉంటుందనే విషయాన్ని కూడా ఇప్పుడు చాలా మంది మరచిపోవడం బాధాకరమన్నారు.
మన సాహిత్యం చదివించాలి:రెండురోజుల పాటు జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో ప్రముఖుల ప్రసంగాలు ఎంతో ఉత్తేజపరిచాయని హైదరాబాద్కు చెందిన రచయిత్రి వి.రాధ తెలిపారు. ప్రతి ఒక్కరు ఇంట్లో పిల్లలను తెలుగులో మాట్లాడేలా ప్రేరేపించాలన్నారు. తెలుగు సాహిత్యం చదివించేలా వారిని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు.
మమ్మీ, డాడీ సంస్కృతి నుంచి అమ్మా, నాన్నకు మళ్లీ మారాలన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల్లో ఈ మార్పు తీసుకురావాలని కోరారు. మాతృభాషకు భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. మాతృభాషతోనే మనకు గుర్తింపు అనే విషయం చాలా మంది మరచిపోతున్నారని, ప్రభుత్వ పరిపాలనలోనూ తప్పనిసరిగా తెలుగు భాషను అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఉన్నత విద్య కూడా మాతృభాషలో:గతంలో చాలా మంది విద్యార్థులు ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివేవారని, ఇంజినీరింగ్, వైద్యం, ఇతర కోర్సులు ఆంగ్లంలో చదివేవారని, అందుకే క్రమంగా ప్రాథమిక విద్యాభ్యాసం కూడా ఆంగ్లంలో ఉంటే ఉన్నత చదువులకు ఇబ్బంది ఉండదనే భావనొచ్చేసిందని నెల్లూరుజిల్లాకు చెందిన కవయిత్రి, ఉపన్యాసకురాలు, ఎ.భారతి తెలిపారు. ప్రాథమిక, ఉన్నత చదువులు తెలుగులో ఉంటే ఇక ఆంగ్లంతో పనేముంటుందన్నారు. రష్యా, జపాన్, ఇజ్రాయిల్ వంటి దేశాలలో మాతృభాషలోనే విద్య మొత్తం కొనసాగుతుందని గుర్తుచేశారు.
ఉద్యమంతోనే పరిరక్షణ సాధ్యం: తెలుగుభాషను పరిరక్షించుకోవాలంటే అందరం కలిసి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కర్నూలుకు చెందిన ఉపన్యాసకురాలు డాక్టర్ డి.పార్వతీదేవి అన్నారు. ఇలా సదస్సులే కాదు, సమాజంలో మార్పు తేవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల్లో మార్పు రావాలని, మన విద్యా వ్యవస్థలో మార్పు రావాలని తెలిపారు. దీనికి సంబంధించి తమ జిల్లాలో కూడా అనేక సదస్సులు పెడుతున్నామన్నారు. కానీ ఫలితం ఉండడం లేదని నిరాశ వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో లాగా మాతృభాషను కాపాడుకోవడానికి ఉద్యమం చేయాల్సిందేనని అన్నారు.