ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకునేవాడు బెటరా? సంపద పెంచే లీడర్​ మేలా? ఓ మహిళా మేలుకో - TDP MANIFESTO VS YSRCP MANIFESTO - TDP MANIFESTO VS YSRCP MANIFESTO

TDP MANIFESTO Vs YSRCP MANIFESTO: ఎన్నికల్లో పార్టీల తలరాతను నిర్దేశించేది మహిళా ఓటర్లే. అలాంటి మహిళలు తమకు భరోసా ఇచ్చే పార్టీని, నాయకుడిని ఎన్నుకునే కీలక సమయం వచ్చింది. ఎవరు కావాలి? ఏ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి? అనేది టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రకటించిన రెండు మ్యానిఫెస్టోల రూపంలో మహిళల ఎదుట స్పష్టంగా కనిపిస్తోంది.

TDP MANIFESTO VS YSRCP MANIFESTO
TDP MANIFESTO VS YSRCP MANIFESTO (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 10:21 AM IST

టీడీపీ మ్యానిఫెస్టోలో మహిళలకు వరాల జల్లు - వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రణాళికలో నిస్తేజం (ETV Bharat)

TDP MANIFESTO Vs YSRCP MANIFESTO :ఎన్నికల్లో పార్టీల తలరాతను నిర్దేశించేది మహిళా ఓటర్లే. అలాంటి మహిళలు తమకు భరోసా ఇచ్చే పార్టీని, నాయకుడిని ఎన్నుకునే కీలక సమయం వచ్చింది. ఒక చేత్తో రూ.10 ఇచ్చి మరో చేత్తో రూ.100 లాగేసుకునే నాయకుడు కావాలా? సంపద పెంచి పేదలకు పంచుతాననే నాయకుడు కావాలా? నిత్యావసరాల ధరలు అమాంతం పెంచి పేద కుటుంబాలు అల్లాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం కావాలా? ధరల్ని నియంత్రించడంతోపాటు వంటింటి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రతి మహిళకి దన్నుగా నిలుస్తామనే ప్రభుత్వం కావాలా?

డ్వాక్రా సంఘాలకు జీవనోపాధి కల్పన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ మహిళల్ని దేశానికే గర్వకారణంగా మార్చిన దార్శనికుడు కావాలా? అదే డ్వాక్రా రుణానికి ఉన్న సున్నా వడ్డీ రాయితీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు తగ్గించిన కుహానా నాయకుడు కావాలా? ఎవరు కావాలి? ఏ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి? అనేది టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రకటించిన రెండు మ్యానిఫెస్టోల రూపంలో మహిళల ఎదుట స్పష్టంగా కనిపిస్తోంది.

టీడీపీ: ఉచితంగా ఏటా 3 వంటగ్యాస్‌ సిలిండర్లు

ప్రస్తుతం ఒక వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.850. గతంలో రూ.1000 కూడా దాటింది. మున్ముందు ధరలు మళ్లీ పెరిగే అవకాశముంది. సాధారణంగా ఒక్కో పేద, మధ్య తరగతి కుటుంబం ఏడాదికి సగటున నాలుగు సిలిండర్లు వినియోగిస్తుంది. ఈ లెక్కన టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఇంటికీ ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్ల హామీ ఆయా కుటుంబాలకు భారీ ఊరటనిచ్చేదే. పేద కుటుంబాలు ఏడాదిలో కేవలం ఒక సిలిండర్‌ను మాత్రమే కొనుక్కోవాల్సి వస్తుంది. కొందరికి అదీ అవసరం పడదు. ఈ హామీ కారణంగా భవిష్యత్తులో సిలిండర్‌ ధరలు పెరిగినా ఆ ప్రభావం వారిపై పడదు.

కూటమి మ్యానిఫెస్టోతో అన్ని వర్గాల అభివృద్ధి- హర్షం వ్యక్తం చేస్తున్న సింహపురి మహిళలు - Alliance manifesto

వైఎస్సార్సీపీ : భారం మరింత పెంచడమే లక్ష్యం

జగన్‌ ఐదేళ్ల పాలనలో విద్యుత్‌, పెట్రోలు, డీజిల్‌లతోపాటు నిత్యావసరాల ధరలు అందనంత ఎత్తుకు వెళ్లాయి. దాంతో కుటుంబాలపై భారం విపరీతంగా పెరిగింది. రానున్న ఐదేళ్లకు సంబంధించి పేదింటి మహిళలకు అండగా నిలిచే ఇలాంటి హామీని తన మ్యానిఫెస్టోలో ప్రకటించలేదు.

టీడీపీ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ప్రస్తుతం రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు బస్సు ఎక్కాలంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. పేదలపై ఈ భారాన్ని తగ్గించాలనే ఆలోచనతోనే టీడీపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ప్రకటించింది. పల్లెలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా ఏపీ అంతటా మహిళలకి ఈ హామీ ఉపయోగపడేదే. ప్రతి కుటుంబంపై ఆర్థికభారాన్ని తగ్గించేదే.

వైఎస్సార్సీపీ: బస్సు ఛార్జీల రూపంలో రూ.5,800 కోట్ల మోత
జగన్‌ సీఎం అయ్యాక ఆర్టీసీ ఛార్జీలను విచ్చలవిడిగా పెంచి ప్రయాణికుల నడ్డివిరిచారు. ప్రజలపై ఐదేళ్లలో కేవలం బస్సు ఛార్జీల రూపంలోనే రూ.5,800 కోట్ల భారం వేశారు. మహిళలకు ఆసరాగా నిలిచే ఇలాంటి హామీ అధికార పార్టీ మ్యానిఫెస్టోలో ఎంత వెతికినా ఎక్కడా కనిపించదు.

టీడీపీ: ప్రతి మహిళకి నెలకు రూ.1,500
వైఎస్సార్సీపీ పాలనలో నిత్యావసరాల ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా అమాంతం పెరిగాయి. 2019కి ముందుతో పోలిస్తే కొన్ని వస్తువుల ధరలు 100 శాతంపైగా పెరిగాయి. ఒకవైపు ఉపాధి లేక, మరోవైపు వంట సరకుల ధరలు భారీగా పెరిగి పేదలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయినా నియంత్రించేందుకు జగన్‌ ఏనాడూ చర్యలు తీసుకోలేదు. పైగా తాము సంక్షేమ పథకాలు ఇచ్చేది అందుకే కదా? అన్నట్టు వైఎస్సార్సీపీ నేతలు తూలనాడారు. ఈ పరిస్థితుల్లో మహిళలకు అండగా నిలిచేలా టీడీపీ ప్రతి మహిళకి నెలకు రూ.1,500 ఇస్తామనే హామీని మ్యానిఫెస్టోలో ప్రకటించింది.

టీడీపీ 'మహాశక్తి'- ఉచిత బస్సు ప్రయాణం హామీపై ఆడపడుచు ఆసక్తి - Free bus For Women

కుటుంబంలో 18-59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామంది. అంటే 18 ఏళ్లు నిండిన వారు ఇద్దరుంటే ఆ కుటుంబానికి నెలకు రూ.3 వేలు, ముగ్గురుంటే నెలకు రూ.4,500 అందనుంది. ఏడాదికి లెక్కేస్తే ఒకరుంటే రూ.18 వేలు, ఇద్దరుంటే రూ.36 వేలు, ముగ్గురుంటే రూ.54 వేలు అందుతుంది. మెజారిటీ కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలు కనీసం ఇద్దరు ఉంటారు. అంటే టీడీపీ మహిళల ఖాతాల్లో నెలనెలా డబ్బులు జమ చేయడం ద్వారా ఆయా కుటుంబాలపై నిత్యావసరాల ధరల భారం దాదాపుగా తగ్గిపోతుంది. ఇదే కదా మహిళలకు కావాల్సింది!

వైఎస్సార్సీపీ: పాత పథకమే కొనసాగింపు
45 ఏళ్ల నుంచి 59 ఏళ్లు మధ్య ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తామని తాజా మ్యానిఫెస్టోలో వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఇది ఇప్పటికే అమలవుతున్న పథకమే. కొత్తదేమీ కాదు. పైగా 2019-24 మధ్య నాలుగు విడతలుగా అందిస్తామని చెప్పి చివరి విడత బటన్‌ నొక్కినా బ్యాంకు ఖాతాల్లో రూ.18,750 ఇప్పటివరకు జమ చేయలేదు. ఇది వారిని మోసం చేయడమే. పైగా ఐదేళ్ల తర్వాత కూడా ఆర్థిక సాయంలో ఎలాంటి పెంపు లేకుండా కొత్త సీసాలో పాత సారా మాదిరిగానే అదే పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు భరోసాగా నిలిచే ఎలాంటి పథకమూ మ్యానిఫెస్టోలో లేదు.

టీడీపీ: బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు
విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి టీడీపీ మరో కీలకమైన హామీ ఇచ్చింది. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలను నేరుగా తల్లుల ఖాతాల్లోకి వేస్తామంది. అంటే ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులుంటే అందరికి రూ.15 వేల చొప్పున జమ చేయనుంది. ఇద్దరు పిల్లలు చదువుకుంటుంటే ఏడాదికి రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు అందించనుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఆర్థిక సాయం అందించడం ద్వారా బాలికా విద్యను ప్రోత్సాహించనుంది. పేద, మధ్య తరగతి ప్రజల పిల్లల చదువుల బాధ్యతను పూర్తిగా తీసుకున్నట్టే లెక్క.

వైఎస్సార్సీపీ: ఒక్క విద్యార్థికే పరిమితం
కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున అందిస్తామని 2019 ఎన్నికల ముందు జగన్‌ సతీమణి భారతి సహా ఇతర వైఎస్సార్సీపీ నేతలు ప్రకటించారు. అధికారంలోకి రాగానే దాన్ని ఒక్కరికే పరిమితం చేశారు. ఇచ్చే రూ.15 వేలలోనూ పాఠశాల నిర్వహణ పేరుతో రూ.2 వేలు కోత వేసి రూ.13 వేలే చెల్లించారు. అందులోనూ ఒక ఏడాది కోత వేశారు. తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టోలోనూ ఆర్థిక సాయాన్ని ఒక్క విద్యార్థికే పరిమితం చేశారు. ఆ ఒక్కరికీ రూ.17 వేలు అందిస్తామని చెప్పి, అందులో రూ.2 వేలు కోత వేస్తామని స్పష్టం చేశారు.

టీడీపీ: డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీ
డ్వాక్రా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ఎనలేని కృషి చేసిన టీడీపీ తాజాగా వడ్డీ భారం లేకుండా వారికి భారీ ఊరటనిచ్చే నిర్ణయాన్ని తన మ్యానిఫెస్టోలో ప్రకటించింది. మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలపై రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీని వర్తింపజేస్తామంది. రాష్ట్రంలో 1.10 లక్షల మంది డ్వాక్రా మహిళలున్నారు. వీరిలో 90% మంది ఉండే డ్వాక్రా సంఘాలు ప్రస్తుతం తీసుకున్న రుణపరిమితి రూ.10 లక్షలకు మించిలేదు. వీరందరికీ పూర్తిగా సున్నావడ్డీ రాయితీ వర్తిస్తుంది. అంటే వీరిపై ఒక్క రూపాయి కూడా వడ్డీ భారం పడదు. ఇక మిగిలిన సంఘాలు రూ.15 లక్షల వరకు రుణాన్ని తీసుకున్నాయి. వీరికి రూ.10 లక్షల వరకు రుణంపై వడ్డీ పడదు. మిగతా మొత్తంపై కూడా పడే వడ్డీ తక్కువే ఉండనుంది. ఈ ఒక్కహామీ కారణంగా రూ.10 లక్షల వరకు రుణం తీసుకున్న సంఘాల్లోని ఒక్కో డ్వాక్రా మహిళకు ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వడ్డీ భారం తగ్గనుంది. ఐదేళ్లకు లెక్కేస్తే రూ.50 వేల నుంచి రూ.75 వేల లబ్ధి చేకూరనుంది.

వైఎస్సార్సీపీ: రూ.3 లక్షలకే వడ్డీ రాయితీ పరిమితం
గత ఎన్నికల ముందు అక్కచెల్లెమ్మళ్లారా అంటూ ఊరూరా తిరుగుతూ అధికారంలోకి రాగానే జగన్‌ డ్వాక్రా మహిళలను మోసం చేశారు. వారు తీసుకునే రుణానికి వర్తించే సున్నా వడ్డీ రాయితీని రూ.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు తగ్గించి వారిపై భారాన్ని మోపారు. ప్రస్తుత మ్యానిఫెస్టోలో రుణ పరిమితి పెంపుపై ఎలాంటి హామీ లేదు. అదే రూ.3 లక్షలకే పరిమితం చేయడం గమనార్హం. అంతేకాదు 2019 వరకు డ్వాక్రా సంఘాల్లోని మహిళలపై ఉన్న వడ్డీ భారం రూ.2,100 కోట్లు చెల్లించకుండా ఎగవేశారు.

డ్వాక్రా రుణమాఫీ చివరి విడత నిధుల విడుదలకు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మండలాలు, పురపాలిక సంఘాల వారీగా డ్వాక్రా మహిళలతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహించారు. మళ్లీ డ్వాక్రా రుణమాఫీ చేయబోతున్నామని, పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవాలని మహిళల్ని ప్రోత్సాహించారు. కానీ, మ్యానిఫెస్టోలో ఆ ఊసే లేదు.

గత ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్‌ ఊరూరా తిరుగుతూ డ్వాక్రా మహిళలపై రూ.25 వేల కోట్ల అప్పు ఉన్నట్లు ప్రచారం చేశారు. దీనికి అప్పటి టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళల నెత్తిన రూ.90 వేల కోట్ల అప్పును పెట్టారు. రుణమాఫీ చేస్తామని వారందరికీ హ్యాండ్‌ ఇచ్చారు.

టీడీపీ: అన్ని వర్గాలకు పండుగ కానుకలు
అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పండుగ కానుకలను అందించింది. పేదవారు సంతోషంగా కడుపునిండా నాలుగు మెతుకులు తినేందుకు ఎంతో ముందుచూపుతో ఈ పథకాన్ని అమలు చేసింది. సంక్రాంతి కానుకలు, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుకల పేరిట ప్రత్యేకంగా ఎంపిక చేసిన నిత్యావసర సరకులను రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా అందించింది. మళ్లీ అధికారంలోకి వస్తే వీటిని పునరుద్ధరిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది.

వైఎస్సార్సీపీ: అప్పట్లో అధికారంలోకి రాగానే వేటు
టీడీపీ అమలు చేసిందంటే చాలు అది పేదలకు మేలు చేసే పథకమైనా సరే కక్షగట్టి నిలిపేయడమే జగన్‌కు తెలిసింది. అదే విధానాన్ని పేదలు పండుగ పూట పప్పన్నం తినేందుకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పండుగ కానుకలపై కూడా ప్రయోగించారు. అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేశారు. తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టోలోనూ కానుకల ఊసే లేదు.

టీడీపీ: అంగన్‌వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లింపు
అంగన్‌వాడీ కార్యకర్తలకు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం భారీగా వేతనాలను పెంచింది. ఐదేళ్లలో రెండు విడతల్లో ఒక్కో కార్యకర్తకు రూ.6,300 మేర పెంచి వారి వేతనాన్ని రూ.10,500కు చేర్చింది. ఇంత భారీగా పెంచినా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించింది. తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల ప్రధాన డిమాండ్‌ అయిన గ్రాట్యుటీపై హామీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు 1.03 లక్షల మంది ఉన్నారు.

వైఎస్సార్సీపీ: సంక్షేమ పథకాలకు దూరం చేసింది
అంగన్‌వాడీలపై జగన్‌ కర్కశంగా వ్యవహరించారు. 2019 ఎన్నికలకు ముందు తెలంగాణ కంటే వేతనాలను ఎక్కువగా పెంచుతామని అధికారంలోకి వచ్చిన ఆయన ఐదేళ్లలో పెంచింది రూ.1000 మాత్రమే. పైగా దీన్ని సాకుగా చూపి వారికి అందుతున్న సంక్షేమ పథకాలన్నీ తీసేశారు. నిత్యావసరాల ధరలు పెరిగి అల్లాడుతున్నామని, వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని వారు రోడ్డెక్కి 50 రోజులకుపైగా సమ్మె చేశారు. వారి మాటను కూడా ఆలకించకుండా పోలీసుల్ని పెట్టి ఉక్కుపాదం మోపారు. ఏకంగా ఎస్మా ప్రయోగించి విధుల్లో నుంచి తొలగించేంత పనిచేశారు. తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుపై ఎలాంటి హామీనివ్వలేదు.

టీడీపీ: ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి
కుటుంబాలకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేసే మహిళలకు రక్షణగా నిలిచేలా టీడీపీ మరో హామీని ఇచ్చింది. పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి కల్పిస్తామంది. ఇది వారికి ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.

వైఎస్సార్సీపీ: ఈ తరహా హామీలను మ్యానిఫెస్టోలో ప్రకటించలేదు.

టీడీపీ: ఆశా కార్యకర్తలకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు

రాష్ట్రవ్యాప్తంగా 43 వేల మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో గౌరవేతనం పెంచాలనే డిమాండ్‌ వీరి నుంచి కూడా ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న టీడీపీ కనీస వేతనం పెంపు దిశగా చర్యలు తీసుకుంటామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది.

వైఎస్సార్సీపీ:తమ కనీస వేతనం పరిధిని పెంచాలని ఆశా కార్యకర్తలు పలుమార్లు ధర్నాలు, నిరసనలు తెలిపినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిరసనలను ఉక్కుపాదంతో అణచివేసింది. తాజా మ్యానిఫెస్టోలోనూ వేతనాల పెంపుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.

టీడీపీ-జనసేన Vs వైఎస్సార్సీపీ మేనిఫెస్టో - ప్రజల స్పందన ఎలా ఉందంటే - NDA Manifesto VS YsrCP Manifesto

ABOUT THE AUTHOR

...view details