Woman Attacked By Stray Dogs :వాకింగ్‌కు వెళ్లిన ఓ మహిళపై వీధికుక్కలు విచక్షణా రహితంగా దాడి చేశాయి. శునకాల గుంపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన మహిళ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఇటీవల జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇదీ జరిగింది :బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. చిత్రపురి కాలనీలో ఓ మహిళ వాకింగ్‌కు వెళ్లారు. సరిగ్గా ఇదే సమయంలో కొన్ని శునకాలు ఆ ప్రాంతంలో తిరుగుతున్నాయి. వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా వీధి కుక్కల గుంపు ఆమెపై దాడికి ప్రయత్నం చేశాయి. ఊహించని అనూహ్య పరిణామం నుంచి మహిళ తేరుకునేలోపే ఆమెను శునకాలు చుట్టుముట్టాయి.
వీధి కుక్కల నుంచి తప్పించుకునేందుకు బాధిత మహిళ కేకలు వేసింది. ఆ విధంగా చాలా సమయం వాటి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తీవ్ర ప్రయత్నం చేసింది. అయినప్పటికీ శునకాలు దాడి చేస్తుండగా ఆమె కిందపడిపోయింది. ఇంతలో అదే మార్గంలో ఓ ద్విచక్రవాహనదారుడు రావడంతో వీధికుక్కలు పరుగులు తీశాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాలో రికార్డయ్యాయి.