Onion Trader Murder Case Mystery Wife Killed Husband in West Godavari District :కుటుంబం కోసం పాటుపడుతూ వివిధ ప్రాంతాల్లో ఉల్లిపాయల వ్యాపారం చేసే వ్యక్తి హత్య కేసు మిస్టరీ వీడింది. అన్ని వేళలా తనకు అండగా ఉండాల్సిన భార్యే ఈ ఉదంతానికి ప్రధాన సూత్రధారి అని పోలీసుల విచారణలో తేలింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని అతడితో కలిసి భర్త చావుకు ప్లాన్ వేసింది. అనుకున్నట్లే భర్తను కడతేర్చినా చేసిన పాపం బయటపడి జైల్లో కూర్చుంది. ఈ కేసులో ఓ మైనర్‌తో పాటు మరో నలుగురు నిందితులను గుర్తించి వారిలో నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు సంఘటన వివరాలు వెల్లడించారు.
అడ్డు అనుకుని - అదను చూసి మట్టు పెట్టారు : పశ్చిమ గోదావారి జిల్లా బంటుమిల్లి మండలం జానకిరామపురం గ్రామానికి చెందిన చిగురుశెట్టి సుభాష్‌చంద్రబోస్ (42), శిరీష భార్యాభర్తలు. భర్త ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో వ్యాపారరీత్యా భర్త వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఆమె ఇంటి వద్దనే ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలో కొంత కాలంగా ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఎనికేపల్లి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి పరశురామయ్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వ్యాపారం కోసం బయట ప్రాంతాలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే చేయాలని సుభాష్ చంద్రబోస్ భావిస్తున్నారు. అదే జరిగితే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించిన శిరీష భర్తను అంతమొందించేందుకు ప్రియుడు పరుశురామయ్యతో పథకం పన్నింది. హత్యకు మరికొందరి సహకారంతో ప్రణాళిక రూపొందించుకున్నారు.
ఈ నెల 5న ఉల్లిపాయలు కావాలంటూ ఓ బాలుడితో సుభాష్ చంద్రబోస్‌కు పరుశురామయ్య ఫోన్ చేయించాడు. దీంతో రాత్రి 7 గంటల సమయంలో ఆటోలో ఉల్లిపాయల మూటలు వేసుకుని బోస్ వెళ్లాడు. అతడు నారాయణపురం శ్మశానవాటిక పరిసరాలకు రాగానే అక్కడే పొంచి ఉన్న పరశురామయ్యతో పాటు నిడమర్రు మండలం భువనపల్లికి చెందిన కెల్లా హేమంత్‌కుమార్, భీమవరానికి చెందిన కోడిగుడ్లు మౌళిలు ఐరన్ పైపు, గాలి పంపుతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బోస్ మచిలీపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.