Vijayawada Durgamma Jewellery : అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ. జగజ్జనని నిజంగా చల్లని తల్లి. ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ, సరస్వతి, పార్వతులకే మూలమైన తల్లి దుర్గమ్మ. అమ్మవారిని ప్రార్థిస్తే జ్ఞానం, సంతానం ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్ఠలు ఇలా ఒకటేమిటి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో దుర్గాదేవిని దర్శిస్తే ఐహిక సుఖాలతో పాటు మోక్షాన్ని కూడా పొందవచ్చనని శాస్త్ర వచనం.
Dasara Celebrations Indrakeeladri :అలాంటి దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాతను దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గగా వాసికెక్కింది. అందులోనూ శరన్నవరాత్రుల్లో అమ్మను దర్శించుకుంటే జీవితం తరిస్తుందని భావిస్తారు. అదే సమయంలో ఉత్సవాల్లో అమ్మవారి అలంకారాలు కూడా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఇందుకోసం భక్తులు కానుకగా ఇచ్చిన ఆభరణాలతోపాటు సంప్రదాయంగా వస్తున్న వాటిని లోకాలను ఏలే తల్లికి అలంకరిస్తారు. ఆ అలంకారాల్లో ఏ ఆభరణాలు వినియోగిస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి భక్తుల్లోనూ ఉంటుంది. మరి ఇప్పుడు అవెంటో తెలుసుకుందామా?
అమ్మవారికి అలకరించే ఆభరణాలు (ETV Bharat) బాలాత్రిపుర సుందరీదేవి :బంగారు పూలజడ,అభయహస్తాలు, కంఠాభరణాలు, బంగారు వడ్డాణం.
గాయత్రీదేవి :స్వర్ణ పంచ ముఖాలు, బంగారు అభయ హస్తాలు, కంఠాభరణాలు, పచ్చల హారం.
అన్నపూర్ణాదేవి :స్వర్ణపాత్ర, హస్తాలు, బంగారు త్రిశూలం.
లలితా త్రిపుర సుందరీదేవి : స్వర్ణ కిరీటం, స్వర్ణాభరణాలు, కంఠాభరణాలు, అభయహస్తాలతో అలంకరిస్తారు.
మహాచండీ దేవి : సింహవాహనం, ఖడ్గం, కంఠాభరణాలు, కర్ణాభరణాలు, హస్తాలు.
మహాలక్ష్మీదేవి : గజరాజు, అభయ హస్తాలు, వడ్డాణం, కర్ణాభరణాలు, ధనరాశులు, కంఠాభరణాలు.
సరస్వతీదేవి : బంగారు వీణ, పగడాల హారం, స్వర్ణహస్తాలు, వడ్డాణంతో అలంకరిస్తారు.
దుర్గా దేవి : శార్దూల వాహనం, సూర్యచంద్రులు, బంగారు త్రిశూలం, శంకుచక్రాలు.
మహిషాసుర మర్ధినిదేవి : సింహ వాహనం, కంఠాభరణాలు, బంగారు త్రిశూలం, స్వర్ణ ఖడ్గం, కర్ణాభరణాలు.
రాజరాజేశ్వరిదేవి :స్వర్ణాభరణాలు, అభయహస్తాలు, చెరకుగడతో అలంకరిస్తారు. బంగారు పూలజడ, కాసులపేరు, దేవిపాదాలు అమ్మవారి రూపాన్ని అనుసరించి వినియోగిస్తారు.
నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం శుభకరం. అన్ని రోజులు కాకున్నా తొమ్మిది రోజుల్లో ఒక్క రోజైన దుర్గమ్మ దర్శనం చేసుకుంటే ఎంతో మంచిది. అమ్మవారి అలంకారాలకు సంబంధించిన వివరాలు, అందులో ఉపయోగించే ఆభరణాలకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకున్నాం కదా! జగన్మాత దర్శనం కోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శోభ - Dasara Celebrationson Indrakeeladri
ఇంద్రకీలాద్రి పేరెలా వచ్చింది? విజయవాడ కనకదుర్గ ఆలయ చరిత్ర మీకోసం! - Dussehra 2024