Warangal Youth Enormous Skills in Archery :పుట్టింది మారుమూల పల్లెలో అయినా, మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు ఈ యువకులు. తమకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, అసమానతలకు విల్లును ఎక్కుపెటి సమాధానం చెబుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో పతకాలు సాధిస్తూ, భవిష్యత్తునకు పునాది వేసుకుంటున్నారు ఈ క్రీడాకారులు. విల్లును ఎక్కుపెట్టి లక్ష్యాన్ని చేధిస్తున్న ఈ యువకుల పేర్లు బండారి భరత్, కోల అచ్చుత్, సముద్రాల అఖిల్. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ (RDF) అకాడమీలో ఆర్చరీ క్రీడలో శిక్షణ తీసుకుంటున్నారు.
ఇటీవల చెన్నైలో 2 రోజుల పాటు జరిగిన సౌత్ జోన్ ఖేలో ఇండియా (Khelo India) ఓపెన్ ఆర్చరీ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకుని అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. విద్యతో పాటు విలు విద్యలో రాణిస్తున్నారు ఈ యువకులు. అర్జునుడి అస్త్రశస్త్రాలు, ఏకలవ్యుడిలోని ఏకాగ్రతను తమలో ఇనుమడింపజేసుకుని అద్భుతంగా రాణిస్తున్నారు. చెన్నైలో జరిగిన ఆర్చరీ పోటీల్లో ఎలిమినేషన్ విభాగంలో అఖిల్ స్వర్ణం, అచ్చుత్ కాంస్య పతకాలతో పాటు నగదు ప్రోత్సాహకం అందుకున్నారు.
'నేను గత ఎనిమిదేళ్ల నుంచి ఆర్చరీ చేస్తున్నా. 25 సార్లు జాతీయ స్థాయిలో ఆడాను. అంతర్జాతీయ స్థాయిలో ఆడతా. ఇండియాలో టాప్ ప్లేయర్గా కావాలనేదే నా లక్ష్యం.' - సముద్రాల అఖిల్, ఆర్చరీ క్రీడాకారుడు.
ఆర్డీఎఫ్ అకాడమీలో సాధన :ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ పోటీల్లో చాలా పతకాలు సాధించామని ఈ యువ క్రీడాకారులు చెబుతున్నారు. అంతర్జాతీయ ఆర్చరీ పోటీలకు ఎంపికైన ఈ ముగ్గురు యువకులు, కల్లెడలోని ఆర్డీఎఫ్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. 9 సంవత్సరాలుగా ఆర్డీఎఫ్(RDF) అకాడమీలో శిక్షణ పొందుతున్నామని వివరిస్తున్నారు. అంతర్జాతీయ టోర్నమెంటులో పతకాలు సాధించమే లక్ష్యంగా సాధన చేస్తున్నామని చెబుతున్నారు. దాదాపు 21 సంవత్సరాలుగా ఆర్డీఎఫ్ అకాడమీని నడిపిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకులు ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు అంటున్నారు.