Vizianagaram Pydithalli Ammavari Sirimanotsavam 2024 :తల్లి దర్శనం అమోఘం, నయనానందకరం. అమ్మరూపం దేదీప్యమానం. అందరినోటా జై పైడితల్లి, జైజై పైడిమాంబ నామస్మరణే. ఆ అపురూప ఘట్టం చూసిన కనులదే భాగ్యం. తరించిన భక్తకోటి పుణ్యఫలం. తల్లి దర్శనం అమోఘం, నయనానందకరం. అమ్మరూపం దేదీప్యమానం. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, విజయనగరం ప్రజల ఇలవేల్పు అయిన శ్రీ పైడితల్లమ్మ సిరిమాను ఘట్టం ఇలా అంగరంగ వైభవంగా జరిగింది. ఆధ్యాత్మికత ఉట్టిపడిన వేళ, అమ్మవారి భక్తజనం లక్షలాది మంది తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో విజయనగరమంతా భక్తజనసందోహంగా మారింది.
ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. సంప్రదాయబద్దంగా పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం, బెస్తవారివల ముందు నడవగా, భక్తుల జయజయద్వానాల మధ్య పైడితల్లి అమ్మవారు ఉత్సవ వీధుల్లో సిరిమాను రూపంలో ముమ్మారు ఊరేగి ప్రజలను ఆశీర్వదించారు. అమ్మవారి ప్రతిరూపంగా సిరిమానుపై పైడితల్లి ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు ఆశీనులై, భక్తులకు దర్శనమిచ్చారు.
సిరి సంపదలనిచ్చే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం - ఆలయ చరిత్ర, జాతర విశేషాలివే!
పుట్టినిల్లు వద్ద మూడు సార్లు ఊరేగిన అమ్మవారు : నెల రోజుల పాటు విజయనగరం రాజులు, పూసపాటి వంశీయుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి. ఉత్తరాంధ్ర ప్రజలు కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి అయిన పైడితల్లి జాతర గత నెల 20న ఆరంభమైంది. నెల రోజుల పాటు జరగనున్న అమ్మవారి జాతరలో తొలేళ్లు, సిరిమానోత్సవం ప్రధాన ఘట్టాలు. ఈ సిరిమాను సంబరం ప్రతియేటా దసరా పండుగ ముగిసిన తర్వాత క్రమంగా తప్పకుండా నిర్వహించటం ఆనవాయితీ. ఎప్పటిలాగే పైడితల్లి అమ్మవారు మూడు సార్లు ఉత్సవ వీధుల్లో సిరిమాను రూపంలో ఊరేగారు. తన పుట్టినిల్లు విజయనగరం కోట వద్దకు వెళ్లి, పూసపాటి వంశీయుల రాజా కుటుంబాన్ని ఆశీర్వదించారు. రాజ కుటుంబానికి దీవెనలు అందించారు.
ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా, ఒడిశా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. పూజారి రూపంలో సిరిమాను అధిరోహించిన అమ్మవారిని చూసేందుకు మధ్యాహ్నం ఒంటిగంటకే బారులు తీరారు. ఎత్తైన భవంతులపైకీ సైతం ఎక్కి సిరిమాను సంబరాన్ని కనులారా తిలకించి, పునీతులయ్యారు.