Vizianagaram police raids on ganja :కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సరఫరా, వాడకాన్ని కట్టడి చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. దీంతో పోలీసు శాఖ కూడా వీటి నియంత్రణపై దృష్టి సారించింది. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ మేరకు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నిఘా పెంచారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులను పెంచి., తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలనూ ఏర్పాటు చేశారు. ఈ బృందాల ద్వారా పాత నేరస్తులు, అనుమానితులపై సస్పెక్టెడ్ షీట్ లు తెరిచేందుకు సమాయత్తమవుతున్నారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడుతున్న వారిపై పీడీ యాక్టు కేసులు నమోదుకూ వెనుకాడబోమని ఎస్పీ హెచ్చరించారు.
అరకు టూ దిల్లీ - 22కిలోల గంజాయి స్వాధీనం ముగ్గురు అరెస్ట్ - Police Seized 22kg of Ganja
విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి రవాణా, నివారణపై పట్టు బిగించారు. గంజాయి ఏ మాత్రం రవాణా జరుగుతున్నా గుర్తిస్తున్నారు. గత శనివారం అరకు నుంచి ద్విచక్రవాహనాలతో వస్తున్న ఇద్దరు యువకులు శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్ పోస్టు వద్ద గంజాయితో పట్టుబడ్డారు. అదేవిధంగా మూడు రోజుల కిందట ఎస్.కోట ఆర్టీసీ బస్టేషన్ వద్ద గంజాయి బ్యాగులతో పలువురు పోలీసులకు చిక్కారు. రెండు రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యాటక ప్రాంతం నుంచి ఓ లారీ వస్తోంది. గంజాయిని తరలించే వాహనంగా అనుమానించిన పోలీసులు శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్ పోస్టు వద్ద అడ్డగించారు. డ్రైవర్ వాహనాన్ని అపకుండా తప్పించుకుని వెళ్లిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు లక్కవరపుకోట పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన చోధకుడు కొత్తవలస మండలం అప్పన్నపాలెం వద్ద వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. ఈ వాహనంలో సుమారు 450కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు.