Vizag Gangamma Thalli Pooja :2004 డిసెంబరు 26వ తేదీ (20 Years Of Tsunami). నాటి సునామీ సృష్టించిన బీభత్సానికి నేటితో 20 ఏళ్లు. ఈ బీభత్సం కారణంగా రాష్ట్రంలో మొత్తం 105 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ విశాఖపట్నం తీరం మాత్రం చెక్కుచెదరలేదు. సహజసిద్ధంగా ఏర్పడిన డాల్ఫిన్ నోస్, సముద్రంలోకి చొచ్చుకొచ్చినట్లుండే కొండల కారణంగా విశాఖ నగరానికి నష్టం తప్పింది. ఎక్కడా ప్రాణనష్టం కూడా జరగలేదు. దీనికి గంగమ్మ తల్లి దీవెనలే కారణమని విశాఖపట్నం మత్స్యకారులు నమ్ముతున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబరు 26వ తేదీన పెదజాలారిపేటలో గంగమ్మ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 26న రోజు పెద్దఎత్తున మత్స్యకారులు తీరం వద్దకు చేరుకుని పూజలు చేస్తున్నారు.
ప్రమాదాలు జరగకూడదని గంగమ్మకు పూజలు : సునామీ వచ్చి 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా విశాఖ పెద్దజాలరిపేట వద్ద సముద్ర తీరంలో మత్స్యకారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పూజల్లో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు. సముద్రంలో పాలు, పసుపు నీళ్లు పోసి గంగమ్మకు దండాలు పెట్టిన మొక్కులు చెల్లించుకుంటున్నారు. సునామీ వచ్చి పోయినప్పటి నుంచి సముద్ర తీరంలో పూజలు చేస్తున్నట్లు మహిళలు తెలిపారు. చేపల వేటకు వెళ్లిన వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని మంచిగా వేట జరగాలని గంగమ్మకు పూజలు చేస్తామని తెలిపారు.
"2004 సంవత్సరం డిసెంబర్లో సునామీ వచ్చింది. ఒక్క ప్రాణానికి హాని కలగకుండా గంగమ్మ తల్లి మమ్మల్ని కాపాడింది. ఈ రోజుకు 20 ఏళ్లు అయ్యింది. అప్పటి నుంచి గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నాం. మమ్మల్ని చల్లగా చూడాలని వేడుకుంటాం."- మత్స్యకారులు