పరుగే ప్రపంచంగా నిరుపేద యువకుడు- అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట Vinukonda Young Man Abdulla Excels in Athletics:నిరుపేద కుటుంబం. కనీస క్రీడా వసతుల్లేని ప్రాంతం. శిక్షణ తీసుకునేందుకు సహకరించని ఆర్థిక నేపథ్యం. ఇవేవీ ఈ యువకుడి పరుగు ఆపలేకపోయాయి. పైగా అంతర్జాతీయ క్రీడావేదికలపై దేశానికి పతకాలు అందించాలనే కసి పెంచాయి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఐనా ప్రతిభతో పాల్గొన్న ప్రతి పోటీల్లో పతకాలు తెస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. దేశ, విదేశీ పోటీల్లో సత్తా చాటుతున్న ఈ యువకుడు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించటమే ధ్యేయంగా కృషి చేస్తున్నాడు.
వినుకొండలోనే పుట్టి పెరిగిన షేక్ అబ్దుల్లాది నిరుపేద కుటుంబం. పదేళ్లుగా మైదానంలో పరుగులు తీయడమే అలవాటుగా మార్చుకున్నాడు. అబ్దుల్లా తండ్రి అల్లాభక్షు తోపుడు బండి మీద పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. తల్లి గృహిణి. ముగ్గురు సంతానంతో కుటుంబ పోషణే కష్టంగా మారినా వెనుకంజ వేయలేదు అబ్దుల్లా. ఇప్పటికే అనేక టోర్నీల్లో అత్యుత్తమ టైమింగ్‌తో అనేక రికార్డులు నెలకొల్పాడు.
పరుగుల పందెం పోటీల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అబ్దుల్లా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని మారథాన్‌పై దృష్టి సారించాడు. ఇప్పటికే 10k, 21k, 42k మారథాన్లలో తనదైన రీతిలో దూసుకుపోతున్నాడు. భూటాన్‌లో జరిగిన సౌత్ ఏషియన్ రూరల్ గేమ్స్ పోటీల్లో ఒక పసిడి, నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో 2 స్వర్ణాలు ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకూ 3 అంతర్జాతీయ, 8 జాతీయ పతకాలు సహా మొత్తం 26 పతకాలు సాధించాడు అబ్దుల్లా.
ఆసియాక్రీడల్లో అదరగొట్టిన విజయవాడ కుర్రాడు - విలువిద్యలో రజతం సాధించిన ధీరజ్
2021లో వినుకొండ నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వరకు వంద కిలోమీటర్ల భారీ మారథాన్‌లో 9 గంటల్లోపే లక్ష్యాన్ని చేరుకుని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. 2024లో జరగబోయే ప్యారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించటమే ప్రస్తుత లక్ష్యంగా పెట్టుకున్నాడు అబ్దుల్లా. అర్హత పోటీల్లో విజయం సాధించేందుకు హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని శిక్షణా కేంద్రంలో తర్ఫీదు పొందే అవకాశం దక్కించుకున్నాడు. కానీ అక్కడకు వెళ్లేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు ప్రతిబంధకాలుగా నిలవడంతో సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.
"చిన్నప్పటి నుంచీ నాకు ఆటలంటే ఆసక్తి. ఈ నేపథ్యంలో మైదానంలో పరుగులు తీయడమే అలవాటుగా మార్చుకున్నాను. నేను రన్నింగ్ బాగా చేస్తున్నానని మా పీఈటీ సార్ నన్ను ప్రోత్సహించి జిల్లా స్థాయి టోర్నమెంట్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొన్నాను. జాతీయ స్థాయిలో 8, అంతర్జాతీయ స్థాయిలో 3 పతకాలు సహా మొత్తం 26 పతకాలు సాధించాను. ఈ ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించటమే నా ధ్యేయం." - షేక్ అబ్దుల్లా, అథ్లెట్
క్రీడాకారులకు ఫిట్‌నెస్ ఎంతో కీలకం. అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీ పడాలంటే మంచి డైట్ కూడా చాలా అవసరం. కుటుంబానికి సరైన ఆదాయ వనరులు లేకపోవడంతో అవసరమైన పౌష్టికాహారం, వసతుల లేమితో ఇబ్బంది పడుతున్నాడు అబ్దుల్లా. అన్ని వసతులూ సమకూర్చలేకపోయినా పట్టుదలతో కుమారుడు పరుగు పోటీల్లో రాణించడం సంతోషంగా ఉందని అబ్దుల్లా తండ్రి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
సరైన ప్రోత్సాహం అందిస్తే అబ్దుల్లా దేశానికి కచ్చితంగా పతకం అందిస్తాడని వినుకొండ వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభావంతులైన ఇలాంటి నిరుపేద క్రీడాకారులకు ప్రభుత్వం చేయూత అందించాలని కోరుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా, సరైన శిక్షణ తీసుకోకున్నా, పాల్గొన్న ప్రతి టోర్నీలోనూ పతకాలు కైవసం చేసుకుంటున్నాడు అబ్దుల్లా. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకునే దిశగా అడుగు లేస్తున్నాడు.
Santhosh Giving Free Army Training to Youth: తన కల నెరవేరకపోయినా.. ఆర్మీ ఉద్యోగం సాధించేందుకు యువతకు శిక్షణ