Vijayawada Hyderabad National Highway to be Upgraded to Six Lanes :విజయవాడ - హైదరాబాద్ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త ఇది. ఈ రెండు ప్రాంతాలకు కలుపుతూ ఉన్న ఎన్హెచ్-65పై ఎలాంటి ఆటంకాలు లేకుండా 100 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేలా రహదారిని తీర్చిదిద్దనున్నారు. నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉండే విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిని పూర్తి స్థాయిలో 6 వరుసలుగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Hyderabad-Vijayawada Highway Widening :విజయవాడ - హైదరాబాద్ మార్గంలో మొత్తం 221.5కిలో మీటర్లను ఆరు వరుసలకు విస్తరించాలని జాతీయ రహదార్ల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. తొలుత ఈ రహదారిలో కేవలం హైదరాబాద్ సమీపంలోని దండు మల్కాపూర్ నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలని తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సవరించింది. అనుమంచిపల్లి నుంచి గొల్లపూడి వరకూ ఆరువరుసలకు రోడ్డును విస్తరించనున్నారు.
మొదట దండు మల్కాపూర్ నుంచి జగ్గయ్యపేట వరకు విస్తరణ పనులు చేపట్టేందుకు వీలుగా 181.5 కిలోమీటర్లకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయించాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి, ట్రాఫిక్ రద్ధీని దృష్టిలో ఉంచుకుని గొల్లపూడి వరకు విస్తరించాలని నిర్ణయించి మరో 40 కిలోమీటర్ల పెరుగుదలకు అనుగుణంగా డీపీఆర్ రూపొందించాలని నిర్ణయించారు. డీపీఆర్ రూపకల్పనకు ఈనెల 24ను తుది గడువుగా నిర్ణయిస్తూ తాజా టెండర్లకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.