VELJAN GROUP JANARDHANA RAO MURDER: ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావును తన మనవడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఈ ఘటన చోటుచేసుకోగా నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్దన్‌రావు కొన్ని సంవత్సరాలుగా సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల తన పెద్ద కుమార్తె కుమారుడు శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టరుగా నియమించారు. అదే విధంగా మరో కుమార్తె అయిన సరోజినీదేవి కుమారుడు కిలారు కీర్తితేజ(29) పేరు మీద రూ.4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడు కీర్తితేజతో కలిసి తండ్రి ఇంటికి వెల్లారు. ఈ సమయంలో ఆస్తి పంపకాల విషయంలో తన తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు.
తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా ఇదే సమయంలో కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను 73 సార్లు పొడిచాడు. కేకలు విన్న సరోజినీదేవి వెంటనే వచ్చి కుమారుడిని వారించబోయారు. ఆ సమయంలో సరోజినీదేవి మీద కూడా దాడిచేసి కత్తితో నాలుగు చోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న కాపలాదారు వీరబాబు వెంటనే రాగా, దగ్గరకు రావొద్దంటూ హెచ్చరించాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు కీర్తితేజ పరారయ్యాడు.