తెలంగాణ

telangana

పంప్​హౌస్​ నుంచి నీటిని తోడేసేందుకు కసరత్తులు ముమ్మరం - అంతా క్లియర్​ అయ్యేందుకు 20 నుంచి 30 రోజులు! - Vattem Pump House Motors Submerge

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 7:06 AM IST

Palamuru RangaReddy Lift Irrigation : నాగర్‌ కర్నూల్ జిల్లా వట్టెం వద్ద నీట మునిగిన పంపుహౌజ్ నుంచి నీటిని తోడి వేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. ఆడిట్ టన్నెల్ ద్వారా సొరంగ మార్గంలోకి వస్తున్న వరదకు అడ్డుకట్ట వేశారు. ప్రవాహం పూర్తిగా ఆగితే ఆరు టన్నెళ్ల వద్ద మోటార్లు ఏర్పాటు చేసి సొరంగ మార్గంలో నిలిచిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తోడి వేయనున్నారు. నీటిని తొలగించేందుకు 20 నుంచి 30 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

Vattem Pump House Submerged
Palamuru RangaReddy Lift Irrigation (ETV Bharat)

Vattem Pump House Submerged :పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంపుహౌజ్, సర్జ్‌పూల్, సొరంగ మార్గాల నుంచి వరద నీటిని తోడేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ముందుగా సొరంగ మార్గంలోకి చేరుతున్న నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపేసి, ఆ తర్వాత తోడి వేసే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ జలాశయాలను నిర్మించారు.

టన్నెల్​లోకి వరద :అందులో మూడోది వట్టెం జలాశయం. ఆ జలాశయానికి ఏదుల నుంచి ఆరున్నర కిలోమీటర్ల బహిరంగ కాల్వ, ఆ తర్వాత 21 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా సాగు నీరు చేరుతుంది. ఈ సొరంగ మార్గ నిర్మాణం కోసం ఆరు ఆడిట్ టన్నెళ్లు నిర్మించారు. నాగర్‌ కర్నూల్ మండలం శ్రీపురం వద్ద ఏర్పాటు చేసిన ఆడిట్ టన్నెల్‌లోకి మంగళవారం భారీ ఎత్తున వరద నీరు చేరింది. ఆ వరద నీరు ఆడిట్‌ టన్నెల్‌కు చేరి, అక్కడ నుంచి ప్రధాన సొరంగ మార్గం, సర్జ్​పూల్, పంపుహౌజ్‌లకు చేరడంతో నీట మునిగింది.

పంప్​హౌస్​ మునక : వట్టెం పంపుహౌజ్‌లో మొత్తం 10 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే నాలుగు మోటార్లు సిద్ధం చేసి ఉంచారు. ఐదో మోటారు బిగింపు పనులు కొనసాగుతున్నాయి. అవన్నీ ప్రస్తుతం మునకకు గురయ్యాయి. ముంపు నుంచి వాటిని బయటకు తీయాలంటే ముందుగా నీటిని ఎత్తిపోయాలి. కానీ శ్రీపురం నుంచి భారీగా నీరు సొరంగ మార్గంలోకి చేరుతోంది. రాళ్లు, మట్టితో అడ్డుకట్ట వేయగా, దాదాపుగా ఆడిట్‌ టన్నెల్‌లోకి వరద ప్రవాహం ఆగిపోయింది.

సొరంగ మార్గంలో సుమారు 14 కిలోమీటర్ల మేర వరద నీరు నిలిచి ఉంది. ఆ నీటిని యుద్ధ ప్రాతిపదికన తోడేయాలి. వరద ప్రవాహం ఆగినందున ఆ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. నీట మునిగిన మోటార్లతో ఎలాంటి నష్టం ఉండదని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు, గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగానే పంపుహౌజ్ ముంపునకు గురైందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు నాగర్‌కర్నూల్ చెరువు నుంచి వచ్చే వాగుకు దగ్గరలోని శ్రీపురం ఆడిట్ టన్నల్​లోకి వరద నీరు చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ముఖ్యమంత్రి స్పందించి బాధ్యులైన అధికారులు, గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని నాగం డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో వినియోగించిన మోటార్లు కాళేశ్వరం కంటే అధిక సామర్థ్యం కలిగిన బాహుబలి మోటార్లు. అవి ప్రారంభించకుండానే ముంపునకి గురికావడం, మరమ్మతులు చేయాల్సి రావడం నీటిపారుదల శాఖకు ఇబ్బందికరమే.

"అధికారులు, గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగానే పంపుహౌజ్ ముంపునకు గురైంది. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు శ్రీపురం ఆడిట్ టన్నల్​లోకి వరద నీరు చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ముఖ్యమంత్రి స్పందించి బాధ్యులైన అధికారులు, గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలి". - నాగం జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో పంప్​హౌస్ నీట మునక - దాదాపు 20 కిమీ సొరంగంలో వరద - PALAMURU PUMP HOUSES SUBMERGED

నీట మునిగిన ఇంట్లో బురదతో బాధితుల ఇబ్బందులు - మున్నేరు శాంతించినా కన్నీరే మిగిలింది - Munneru Flood Effect

ABOUT THE AUTHOR

...view details