Vamsadhara Project Expats Facing Problems : వంశధార ప్రాజెక్టు వస్తే తమ బతుకులు బాగుపడతాయనుకున్నారు ఆ గ్రామస్థులు. గ్రామాలను పట్టణాలుగా చేసి అందరికీ ఉపాధి చూపి అభివృద్ధి వైపు బాటలు వేస్తామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తోంది. అభివృద్ధి మాట దేవుడెరుగు కనీసం మౌలిక సదుపాయాలు లేక వంశధార నిర్వాసితగ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టును ఆనుకొని ఉన్న హిరమండలం మేజర్ పంచాయితీలో చివరికి త్రాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు లాంటి ప్రాథమిక మౌలిక వసతులు లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వంశధార నదికి భారీగా పెరిగిన వరద.. లోతట్టు గ్రామాలకు ప్రమాద హెచ్చరిక
శ్రీకాకుళం జిల్లాలో వంశధార రిజర్వాయర్ను 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మించడం కోసం హిరమండలం, కొత్తూరు, ఎల్.ఎన్ పేట మండలాల్లో మొత్తం 21 గ్రామాలకు చెందిన 10 వేల మంది కుటుంబాలును ఖాళీ చేయించారు. వీరందరిని నిర్వాసిత గ్రామాలకు తరలించారు. ప్రాజెక్టు రావడం వల్ల నష్టపోయిన గ్రామస్థులకు భవిష్యత్తులో నిర్మించే నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులతో పాటు ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Vamsadhara Expats Fire YCP Government :అయితే ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ హామీ నెరవేరటం లేదని నిర్వాసిత గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు రాకముందు చుట్టుపక్కల 20కి పైగా గ్రామాలకు వ్యాపార, వాణిజ్య, ఉపాధి కార్యకలాపాలకు కేంద్ర స్థానమైన హిరమండలం మేజర్ పంచాయితీలో కూడా ప్రస్తుతం మౌలిక వసతుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో త్రాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు లాంటి కనీసం మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రభుత్వంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.