UNRECOGNISED VILLAGE IN TELANGANA: అదో ఊరు. ఉందా అంటే ఉంది. దానికి పేరుందా అంటే అదీ ఉంది. కానీ అధికారిక రికార్డుల్లోకి మాత్రం రావటం లేదు. ఏదో ఓసారి సిబ్బంది తప్పిదం జరిగి, ప్రస్తావనకు రావటం లేదంటే అదీ కాదు. అక్షరాలా 18 ఏళ్ల కిందట ఏర్పడిన ఆ పల్లె ఇప్పటికీ ఏ పంచాయతీ పరిధిలోకి వస్తుందో వెల్లడి కావటం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పరిధిలోకి వచ్చే సుందర్‌నగర్ గ్రామస్థుల దుస్థితి ఇది.
ఊరు ఏర్పడక ముందు పద్దెనిమిదేళ్ల వెనక్కి వెళ్తే 2006లో ఇంద్రవెల్లి పంచాయతీ పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను ఏమాయికుంట గ్రామ పంచాయతీ శివారులో 90 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసింది. కొత్తగా ఏర్పడిన ఆ పల్లె పేరును సుందర్‌నగర్‌గా పెట్టుకున్నా ఇప్పటికీ ఏ గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుందో తేలలేదు.
ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ చెందినవారైతే స్థలమేమో ఏమాయికుంట పరిధిలో ఉంది. ఫలితంగా సుందర్‌నగర్ ఏ పంచాయతీ పరిధిలోకి వస్తుందో ఇప్పటికీ స్పష్టత రాలేదు. 400 జనాభా కలిగి ఉన్నా కనీస వసతులకు నోచుకోవటం లేదు. ప్రజల దయనీయ పరిస్థితి చూసి గతంలో ఓ కలెక్టర్ గ్రామానికి పంచాయతీ ప్రస్తావన లేకుండానే విద్యుత్ సౌకర్యం కల్పించగా, ఉట్నూర్ ఐటీడీఏ రెండు బోర్లు వేయించింది. అక్కడ ఓ అంగన్‌వాడీ భవనం తప్పితే ఊర్లో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు లేవు. నిరుపేదలకు పక్కా ఇళ్ల ఊసే లేదు. చివరికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందనే ఆవేదన బాధితుల్లో వ్యక్తమవుతోంది. పంచాయతీ గుర్తింపు అనేది ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేయాల్సిన ప్రక్రియ అనే మాట అధికారవర్గాల నుంచి వినిపిస్తోంది.