Union Minister Srinivasa Varma Political Career:భూపతిరాజు శ్రీనివాసవర్మ ఒకప్పుడు కొందరికి మాత్రమే తెలిసిన ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిచయమైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరఫున మంచి మెజార్టీతో విజయం సాధించిన శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో అనూహ్యంగా చోటు లభించింది. కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ 1967 ఆగస్టు 4న భీమవరంలో జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. మాస్టర్ లైబ్రేరియన్ కోర్సు చదివిన వర్మ లైబ్రేరియన్‌గా ఉద్యోగం చేశారు. తర్వాత బీజేపీలో చేరిన శ్రీనివాసవర్మ రెండు దశాబ్దాల పైగా పార్టీలోనే కొనసాగుతున్నారు.
రాష్ట్రం నుంచి మరొకరికి కేంద్రమంత్రి వర్గంలో చోటు! - Narasapuram MP Srinivas varma
సంఘ్ పరివార్‌తో సత్ససంబంధాలు కలిగిన శ్రీనివాసవర్మ ఎబీవీపీలో చురుగ్గా పనిచేసి పార్టీలో గుర్తింపు పొందారు. 1992 నుంచి 95 మధ్యలో జిల్లా యువ మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గానూ సేవలందించారు. తాజాగా కూటమి తరఫున నర్సాపురం అభ్యర్థిగా పోటీచేసిన భూపతిరాజు శ్రీనివాసవర్మ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉమాబాలపై 2,76,802 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. నర్సాపురం లోక్‌సభ స్థానంలో ఇప్పటివరకు ఎవరికీ రాని మెజార్టీ తెచ్చుకుని రికార్డు సృష్టించారు.