Two Crore Fraud In Satya Sai District : తాళాలు వేసి ఉన్న ఇళ్లే తన టార్గెట్ అంటాడో గజ దొంగ. రోడ్డుపై ఒంటరిగా వెళ్లున్న మహిళ మెడలోని గొలుసుకు టెండరేస్తాడో చోరుడు. బస్టాప్‌లలో, రైల్వే స్టేషన్లలో కాపుకాస్తాడో కేటుగాటు. ఇలా దొంగతనాలకు, లూటీలకు ఎవరికి తోచిన విధానాన్ని వాళ్లు అనుసరిస్తారు. వీటికి ఆన్లైన్ మోసాలు తోడయ్యాయి. వడ్డీల పేరుతో గ్రామస్థులను వలలో వేసుకున్న వ్యక్తి మోసం తనకల్లులో చోటు చేసుకుంది.
Two Crore Scam in Sathya Sai District : శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు, నల్లచెరువు పోలీస్ స్టేషన్ల పరిధిలో వేరువేరు కేసుల్లో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్పల మండలానికి చెందిన చిన్న ఓబులేసు మహేశ్వర్ రెడ్డిగా పేరు మార్చుకుని నల్లచెరువు మండలంలో కోట్లల్లో కుచ్చుటోపీ పెట్టాడు. తక్కువ ధరకే చక్కెర, సిగరెట్లు ఇప్పిస్తానంటూ చిన్న ఓబులేసు 2 కోట్ల 36 లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించాడు. అధిక వడ్డీ పేరుతో గ్రామస్థుల నుంచి కోట్లల్లో వసూలు చేసి నల్లచెరువు నుంచి ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు చిన్న ఓబులేసుని అతనికి సహకరించిన శివ, శీను అనే మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
తనకల్లు మండలంలో మోహన్ రాజు, అరుణ్ కుమార్ , నాగరాజు అనే ముగ్గురు నిందితులు యువకులకు ఉద్యోగాల పేరుతో వల వేశారు. గ్రామీణ యువజన వికాస్ బ్యాంక్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఐదుగురి నుంచి 6 లక్షల 50 వేల రూపాయలు వసూలు చేశారు. డబ్బులు తీసుకుని ఏడాది కావస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.