Tourists At Gunjiwada Water Falls in Alluri District :ప్రకృతి సౌందర్యం పరవశింపజేస్తుంది. కొండకోనల నుంచి జాలువారే జలపాతం అందాలు మనసును పులకరింపజేస్తాయి. ప్రకృతి అందాలను తిలకించి దాని ఒడిలో సేదతీరేందుకు ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని గుంజివాడ జలపాతానికి పర్యాటకులు తరలివస్తున్నారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలం జామిగూడ పంచాయతీలోని ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న జలపాతం హొయలు చూసి పర్యాటకులు మైమరచిపోతున్నారు.
యువతీ, యువకులు కెమెరాల్లో ఫొటోలు దిగుతూ ఆనందిస్తున్నారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి పర్యాటకులు వస్తున్నారు. సరైన రహదారి సౌకర్యం లేక ఈ ప్రాంతానికి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు పర్యాటకులు తెలిపారు. రహదారి సౌకర్యం కల్పిస్తే పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటున్న పర్యాటకులతో మా ప్రతినిధి శివ.
కనువిందు చేస్తున్న శేషాచలం జలపాతాలు - కపిల తీర్థంలో భక్తుల సందడి
అనంతపురం జిల్లాలోని తలుపుల మండలం బట్రేపల్లి వద్ద జలపాతం (water falls) కొద్ది రోజులుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండలపై నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది. జలపాతం వద్ద ఉత్సాహంగా గడిపేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
అల్లూరి జిల్లాలోని పెద బయలు మండలంలోనే తారాబు జలపాతం సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటోంది. సుమారు 500 అడుగుల పైనుంచి జాలు వాడుతున్న నీటి ప్రవాహాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారు. ఎంతో కష్టపడి తారాబు జలపాతానికి చేరుకుంటున్నారు. అయితే అక్కడ ప్రకృతి సౌందర్యం నడుమ తారాబు జలపాతాన్ని చూసి తాము పడిన శ్రమను సైతం మర్చిపోతున్నారు.
మరోవైపు తారాబు జలపాతానికి వెళ్లేందుకు వీలుగా బూసిపుట్టు కూడలి నుంచి జలపాతానికి బీటీ రహదారి నిర్మాణాన్ని సైతం అధికారులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపించి జలపాతానికి వెళ్లేందుకు వీలుగా సుమారు ఐదు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి దాదాపు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీంతో ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ తారాబు జలపాతానికి వెళ్తున్న పర్యాటకులు ఇకనుంచి ఎంచక్కా బీటీ రహదారిలోనే వెళ్లి జలపాతం సోయగాలను ఆస్వాదించే వీలు కలుగుతుంది.
ఎత్తిపోతలకు జలకళ - సందర్శకులను ఆకటుకుంటున్న జలపాతం - Tourist at Ethipothala Waterfall