Tough Situation for Uttarandhra Ministers: జగన్ ప్రభుత్వ వ్యతిరేక పవనాల ఉద్ధృతి క్రమేణా పెరుగుతుండటంతో ఉత్తరాంధ్రలో మంత్రులు సైతం గెలిచేందుకు ఎదురీదుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నేతలు, వారి బంధువర్గం, అనుచరగణం చేసిన అవినీతి అక్రమాలు వారిని వెంటాడుతున్నాయి. పైగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏమీ లేవు. ప్రజలను మెప్పించే స్థాయి పనలూ ఏమీ చేయలేదు. అయిదు సంవత్సరాల చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం?
నియోజకవర్గంలో సమస్తం ప్రజలను పీడించిన రాజ్యాధికారం అని ప్రతి ఊరూ ఘోషిస్తోంది. కేవలం డబ్బులు పంచి, చివరి మూడు, నాలుగు రోజులు కొనుగోళ్ల పర్వం సాగించి బయటపడాలని మంత్రులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ప్రజావ్యతిరేక పవనాల్లో ఆ ప్రయత్నాలు ఫలించడమూ ప్రశ్నార్థకంగానే ఉంది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌లు గెలిచేందుకు ఎదురీదుతున్నారు. మరో మంత్రి సీదిరి అప్పలరాజు హోరాహోరీ పోరాడుతున్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోవడంతో వీరా అమాత్యులు? ఇలాంటివారా నాయకులు అంటూ ఉత్తరాంధ్ర ప్రజానీకం నిలదీస్తోంది.
రాజంపేట బరిలో మాజీ సీఎం - అన్న ఎంపీ, తమ్ముడు ఎమ్మెల్యే! - Rajampet LOK SABHA ELECTIONS
‘ధర్మా’న గెలవడం కష్టమే!:సీనియర్ నేత, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల బరిలో ఆపసోపాలు పడుతున్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని రెండున్నర సంవత్సరాలు బయటకే రాలేదు. కరోనా సమయంలోనూ ప్రజల్ని పట్టించుకోలేదు. రెండో దఫాలో మంత్రి పదవి దక్కిన తర్వాతే అడుగు బయటపెట్టారు. మంత్రి పదవి లేకపోతే ప్రజలు కనిపించరా అంటూ శ్రీకాకుళం ప్రజలు నిలదీస్తుండటం ఈ ఎన్నికల్లో ధర్మానకు సమస్యగా మారింది. శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్న 2.14 ఎకరాల భూమి ఆక్రమణల వ్యవహారం మరో ముఖ్యమైన అంశం. శ్రీకాకుళం, ఆమదాలవలస మధ్య 15 కి.మీ. రోడ్డు నిర్మాణం అయిదు సంవత్సరాలలో పూర్తి చేయకపోవడం, ఈ రహదారిపై వరుస ప్రమాదాలు జరిగి ఏకంగా 24 మంది మరణించిన ఘటనలు ధర్మాన ప్రసాదరావుకు పెద్ద మైనస్. స్టేడియం, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తి చేయలేదు. ఇవన్నీ ఎన్నికల సమయంలో ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
టీడీపీ నుంచి యువకుడైన గొండు శంకర్‌ను బరిలో నిలిపారు. ఆయన రెండు సంవత్సరాలుగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. ఆయన కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. చివరి నిమిషంలో లక్ష్మీదేవికి అభ్యర్థిత్వం నిరాకరించిన టీడీపీ శంకర్‌ను బరిలో నిలిపింది. లక్ష్మీదేవి ఈ ఎన్నికల్లో నిశ్శబ్దంగా ఉండిపోతుండటంతో ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ధర్మాన వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్మీదేవి, అప్పలనర్సయ్యలతో మాట్లాడారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ నేత కూన రవికుమార్, గొండు శంకర్‌లు కలిసి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌తో సమావేశమయ్యారు. ధర్మాన చివరి మూడు రోజుల ధన మంత్రాంగంతో పై చేయి సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత, ధర్మానపై ఉన్న అసంతృప్తి ఫలితాన్ని ఎటు వైపు నిలబెడతాయో చూడాలి.
ప్రకృతి అందాలకు నెలవు అమలాపురం - స్పీకర్ బాలయోగి సేవలు చిరస్మరణీయం - Amalapuram LOK SABHA ELECTIONS
విద్యామంత్రి ఎదురీత:సీనియర్ నేత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకూ కష్టకాలమే. చీపురుపల్లి నియోజకవర్గంలో స్థానికులకు అందుబాటులో ఉండరు. ఏదైనా కార్యక్రమం ఉంటే తప్ప ఇక్కడికి రారు. చీపురుపల్లి రాజకీయం అంతా ఆయన మేనల్లుడు, విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చేతిలోనే ఉంది. చిన్న శ్రీను వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలున్నాయి. నియోజకవర్గంలో భూఆక్రమణలు ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి. అధికార పార్టీ కీలక నేత ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి వెంచర్లను ఆక్రమించుకోవడం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టింది. సీనియర్ మంత్రిగా బొత్స మార్కు అభివృద్ధి ఎక్కడా కనిపించదు. చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంఘాన్ని ఏపీడీసీఎల్‌లో విలీనం చేయడంపై ప్రజల్లో అసంతృప్తి పెంచింది. మేనల్లుడు మజ్జి శ్రీనివాసుతో కుటుంబంలో వచ్చిన విభేదాలూ కొంత ప్రభావం చూపుతున్నాయంటున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి పెరిగిన వలసలూ బొత్సకు ఇబ్బందికరమే.
తెలుగుదేశం నుంచి కిమిడి కళా వెంకటరావు చీపురుపల్లి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జున ఈ నియోజకవర్గంలో అభ్యర్థిత్వం ఆశించారు. వెంకటరావు నామినేషన్ రోజు నాగార్జున సైతం హాజరయ్యారు. వీరిద్దరూ జట్టుగా కదిలితే ఎదురులేదన్న అభిప్రాయం ప్రజల్లో వినిపిస్తోంది. బొత్స, వెంకటరావులిద్దరిదీ ఒకే సామాజికవర్గం. గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాలు ఇక్కడ కీలకం. కిందటి ఎన్నికల్లో బొత్స గెలుపునకు ప్రధాన పాత్ర పోషించిన మెరకముడిదాం మండలంలో ఇప్పుడు వైఎస్సార్సీపీ ఎదురీదాల్సి రావడం ఆయనకు ప్రతికూలాంశం. జనసేన టీడీపీకి మద్దతివ్వడంతో కొన్ని వర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పెరుగుతోంది. చివరి 10 రోజులు బొత్స డబ్బుతో చేసే రాజకీయమే కీలకమని స్థానికులే చెబుతున్నారు. ప్రలోభపెట్టి అన్ని పార్టీల్లోనూ మద్దతుదారులను తయారుచేసుకుంటారని, రాత్రికి రాత్రే ఓట్లు కొనేస్తారన్నది వారి గతానుభవం.
గుంటూరు గడ్డ టీడీపీ అడ్డా - నేటికీ అడుగుపెట్టని వైఎస్సార్సీపీ - Guntur LOK SABHA ELECTIONS
ప్రజావ్యతిరేకతతో సభాపతి ఉక్కిరిబిక్కిరి:శాసనసభాపతి తమ్మినేని సీతారాం ప్రజా వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ‘పెట్రోలు బంకు ఏర్పాటు చేసుకున్నారు. ఇల్లు కట్టుకున్నారు. కాలేజీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలకు రోడ్డు మాత్రం వేయలేకపోయారని ఆమదాలవలస పట్టణంలోని ఒక మెడికల్ షాపు యజమాని నిలదీశారు. మరోసారి ఆయనను ఎన్నుకునేది లేదని తెగేసి చెప్పారు. ‘ఆయన దగ్గరికి వెళ్లాలంటే ఆ కుటుంబంలో అందరినీ సంతోషపరచాలి. ఏ పనీ చేయరు వాళ్లు’’ అని మరో దుకాణ యజమాని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎవర్ని కదిపినా సీతారామ్‌పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.