Too Much Drainage Problems in Vijayawada :విజయవాడ డ్రైనేజీ సమస్యపై గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణంగా నేడు నగర వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు కాలనీల రోడ్లు, ప్రధాన రహదారులు మురుగునీటితో కంపుకొడుతున్నాయి. మురుగు కాలువలకు అడ్డంకులు ఏర్పడడంతో వర్షం నీరు, మురుగు ఏకమై రోడ్లపై ప్రవహిస్తోంది. మురుగునీరు రోడ్లపై రోజుల తరబడి నిల్వ ఉండడంతో చుట్టుపక్కల ప్రజలు అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో జగన్ సర్కార్ విజయవాడలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అంతకు ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాబట్టిన నిధులను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినియోగించుకోవడంతో విఫలమయ్యింది. దీంతో ప్రస్తుతం మురుగు సమస్యతో బెజవాడ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
చిన్నపాటి వర్షానికే పొంగి పొర్లుతున్న డ్రెయిన్లు :చిన్నపాటి వర్షం కురిసినా నగరంలోని అన్ని రహదారులపైనా పెద్ద ఎత్తున మురుగు నీరు ప్రవహిస్తోంది. దీంతో పాటు రోజుల తరబడి మురుగు నీరు రహదారులపైనే నిలిచిపోతుంది. మురుగు కాలువలు సక్రమంగా పారడం లేదు. డ్రైనేజీలు జనావాసాల పక్కనే ఉండడంతో స్థానిక ప్రజలు, చిరువ్యాపారులు సైడ్ కాలువల్లో చెత్తా చెదారం పెద్ద ఎత్తున పడేస్తున్నారు. దీంతో మురుగు నీరు, వర్షపు నీరు సక్రమంగా పారడం లేదు. ఎప్పటికప్పుడు చెత్త కాలువల నుంచి తొలగించాల్సిన వీఎంసీ సిబ్బంది రెండు మూడు వారాలకు ఒక్కసారి వచ్చి చెత్త తొలగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మురుగు కాలువలు, వర్షం నీటి కాలువలు సక్రమంగా పారకపోవడంతో పెద్ద ఎత్తున దోమలు, ఈగలు చేరి స్థానిక ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతమౌతున్నారు.
బెజవాడలో పారిశుధ్యం అస్తవ్యస్తం - ఆనారోగ్యంతో ప్రజలు విలవిల - Drainage Problems in Bejawada
వైఎస్సార్సీపీ పాలనతో విజయవాడ ప్రజల పాట్లు :వీఎంసీ పరిధిలో 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం చేపట్టిన మురుగు కాలువల పనులు వైఎస్సార్సీపీ పాలనలో అర్థాంతరంగా ఆగిపోయాయి. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను గుర్తించి ప్రజలకు డ్రైనేజీ సమస్య నుంచి విముక్తి కలిగించాలని భావించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు సుమారు 462 కోట్ల రూపాయలు నిధులు రాబట్టింది. అభివృద్ధి పనులను ఎల్‌ఎన్‌టీ(L&T) సంస్థ ప్రారంభించింది. టీడీపీ హయాంలోనే సుమారు రూ.200 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం డ్రైనేజీ పనులకు మంగళం పాడింది. గుత్తేదారులకు చేపట్టిన పనులుకు చెల్లించాల్సిన బిల్లులు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేసింది. దీంతో ఆ గుత్తేదారు సంస్థ పనులు మధ్యలోనే నిలిపి వేసిందని సమాచారం.
తీవ్ర అవస్థలు పడుతున్న నగర ప్రజలు, వాహనదారులు :విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో 1.01 లక్షల ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఉండగా కనెక్షన్లు లేని ఇళ్లు 1.09 లక్షల ఇళ్లు ఉన్నాయి. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక చిన్నపాటి వర్షానికే చాలా కాలనీలు నీటమునుగుతున్నాయి. చాలా మంది ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు తీసుకోలేదు. దీంతో ఆ నీరంతా రోడ్లపైనే పారుతుంది. విజయవాడలో ప్రధాన రహదారులన్నింటిపై భారీ స్థాయిలో నీరు నిలుస్తోంది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, ఆటోనగర్ వందడుగల రోడ్డు, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సర్వీసు రోడ్డులు, మహానాడు రోడ్డుతో పాటు వివిధ కాలనీల రోడ్లు వర్షం నీటితో నిండిపోతున్నాయి. మురుగు నీటి నుంచి రాకపోకలు సాగించడానికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.