ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్సీపీ హయాంలో కౌంటర్లు తగ్గించారు- తొక్కిసలాటకు అదే ప్రధాన కారణం - TIRUPATI STAMPEDE

గత ప్రభుత్వ విధానాలనే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందనే ఆరోపణలు-పాత విధానాలను సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని భక్తుల సూచన

Tirupati Stampede Due to YSRCP Government Decisions
Tirupati Stampede Due to YSRCP Government Decisions (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2025, 6:20 PM IST

Updated : Jan 11, 2025, 10:39 PM IST

Tirupati Stampede Due to YSRCP Government Decisions :వైఎస్సార్సీపీ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు శ్రీవారిని సామాన్య భక్తులకు దూరం చేసేలా వ్యవహరించారనే విమర్శలున్నాయి. గత ప్రభుత్వ విధానాలనే కూటమి ప్రభుత్వం కొనసాగించడం తిరుపతి తొక్కిసలాటకు ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఉన్న వైకుంఠ ద్వారా దర్శనాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 10 రోజులకు పెంచి వైకుంఠ ద్వార దర్శనానికి ఉన్న విశిష్టతను దెబ్బతీసిందన్న విమర్శలు ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం అదే విధానాన్ని కొనసాగించింది.

గత సర్కార్‌ విధానాలను సమీక్షించి భక్తులకు మెరుగైన రీతిలో దర్శనం కల్పించేలా నిర్ణయాలు తీసుకోవడంలో అధికారుల వైఫల్యం నిండు ప్రాణాలను బలితీసుకొందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఆలయ ఆకృతి పరంగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా దర్శనాల సంఖ్య పెంచడానికి వీలు లేకపోవడంతో సాంకేతికతను వినియోగించుకొని భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో గడచిన రెండు దశాబ్ధాల కాలంలో దర్శన విధానాలు, దర్శన టికెట్ల జారీలో భారీ మార్పులు జరిగాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి 1991లో రోజుకు 32వేలకుమందికి పైగా మంది రాగా 2021 నాటికి ఆ సంఖ్య 65 వేలకు చేరింది. భక్తుల రద్దీని అనుసరించి 2001లో అప్పటి ధర్మకర్తల మండలి వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2ను నిర్మించింది. భక్తుల సంఖ్య మరింత పెరుగుతుండటంతో 2014లో నారాయణగిరి ఉద్యాన వనాల్లో షెడ్లను ఏర్పాటు చేశారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వేచి ఉండే సమయాన్ని తగ్గించే లక్ష్యంతో 1999 ప్రాంతంలో సుదర్శన టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. సుదర్శన టోకెన్ల జారీ కోసం తిరుపతిలో టీటీడీ కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. మారుతున్న సాంకేతికతను వినియోగిస్తూ మరింత సౌకర్యవంతంగా 2017 చివరి నెలలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలలో 14 ప్రాంతాల్లో టోకెన్ల జారీ చేపట్టారు.

ఎస్​ఎస్​డీ విధానాన్ని విస్తరిస్తూ తిరుపతి, తిరుమలతోపాటు గాలిగోపురం వద్ద మొత్తం 109 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేశారు. కొవిడ్ నేపథ్యంలో ఎస్​ఎస్​డీ కౌంటర్లు మూసివేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్​ఎస్​డీ విధానంలో టోకెన్ల జారీని తిరుపతిలోని మూడు కేంద్రాలకు పరిమితం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వైఎస్సార్సీపీ విధానాలపై సమీక్ష లేకుండానే వాటిని కొనసాగిస్తోంది.

వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో వైభవంగా చక్రస్నానం

సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాలు అధికంగా ఉండటం ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సౌకర్యవంతంగా దర్శనం టికెట్లు పొందగలుగుతారు. వైఎస్సార్సీపీ హయాంలో డబ్బుల ఆదా పేరుతో సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేసినా ఎన్​డీఏ ప్రభుత్వ అధికారులు ఎలాంటి సమీక్షలు లేకుండా భక్తుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోకుండా అదే విధానాలను కొనసాగిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణ స్వభావ రీత్యా రోజుకు 70 వేల మంది భక్తులు దర్శనం చేసుకొనేందుకు వీలుంటుంది.

రోజుకు దాదాపు 25 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వీఐపీ బ్రేక్​తో పాటు శ్రీవాణి, దాతలు, ఆర్జిత సేవల టికెట్లు పొందిన భక్తులు ఇలా వివిధ రకాల దర్శనాలు మరో పదివేలమందితో కలిపి 35 వేలు ఉంటాయి. వీటికితోటు 35 వేల నుంచి 40 వేల మంది సామాన్య భక్తులు ఉచిత దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. ఆర్థిక వనరుల ఆదా పేరుతో గత వైఎస్సార్సీపీ తీసుకొన్న నిర్ణయాలతో సామాన్య భక్తులు ఇబ్బందులు పాలయ్యారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించారు. గతంలోని లోపాలను గుర్తించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అనుగుణంగా మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ అధికారులు మాత్రం గత ప్రభుత్వ విధానాలు భక్తులకు సౌకర్యవంతంగా ఉన్నాయా, లేదా అన్న సమీక్షలు చేయకుండా పాత విధానాలనే కొనసాగిస్తూ వచ్చారు.

వైఎస్సార్సీపీ పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు అనువుగా ఉండేలా తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీని ప్రభావంపై ప్రస్తుత అధికారులు పట్టించుకోలేదు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ఆస్కారం ఉందని తెలిసినా, గత విధానాలనే కొనసాగించి తొక్కిసలాటకు ఆస్కారం కల్పించారు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పర్యటనలోనూ గతంలో అనుసరించిన విధానాలనే అమలు చేశామని చెప్పుకొచ్చారు.

తాజాగా జరిగిన ఘటనలకు పోలీసుల విధి నిర్వహణలో అలసత్వంతోపాటు టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయం ఒక కారణమనే విమర్శలు ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి మొదలుకొని తొలి మూడు రోజులకు లక్షా 27వేల టోకెన్లు జారీ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ఏ రోజుకు ఆ రోజు టోకెన్లు ఇస్తామని తెలిపారు. దీంతో మూడు రోజుల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతోపాటు స్థానికులు తోడవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ప్రస్తుత ఘటనతోనైనా టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు పాత విధానాలను సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని భక్తులు సూచిస్తున్నారు.

భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు: టీటీడీ ఛైర్మన్‌

Last Updated : Jan 11, 2025, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details