Tirumala Darshan Tickets Scam :శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఆయా రాష్ట్రాల టూరిజం ప్యాకేజీలు, ఆర్టీసీలకు కేటాయించిన ఎస్‌ఈడీ రూ.300 టికెట్లు పెద్దఎత్తున దుర్వినియోగం అయ్యాయి. వైఎస్సార్సీపీ పాలనలో రెండు, మూడు రెట్లకు పైగా ధరకు వాటిని విక్రయించినట్లు వెల్లడైంది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, విద్యార్థుల నుంచి ఉన్న డిమాండును సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలోని టీటీడీ ధర్మకర్తల మండలి ఏపీతోపాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు, ఆర్టీసీలకు రూ.300 టికెట్లను భారీగా జారీచేసింది. రోజుకు ఏపీఎస్‌ఆర్టీసీకి 1000 టికెట్లు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు 1000, గోవా పర్యాటక శాఖకు 100, ఇండియన్ రైల్వేస్‌కు 250, తెలంగాణ పర్యాటక శాఖకు 350, తెలంగాణ ఆర్టీసీకి 1000, ఇండియన్ టూరిజం విభాగానికి 100, కర్ణాటక పర్యాటక శాఖకు 500, పుదుచ్చేరి పర్యాటక శాఖకు 100, తమిళనాడు పర్యాటక శాఖకు 1000 కలిపి మొత్తం 5400 టికెట్లను జారీచేసింది. ఆయా రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలను అభివృద్ధి చేసి ప్రజారవాణాకు ఆదాయాన్ని పెంచేందుకు వీటిని కేటాయించినట్లు అప్పట్లో టీటీడీ ధర్మకర్తల మండలి ప్రకటించింది.
ఏజెంట్ల చేతుల్లోకి టికెట్లు - భక్తులకు టోకరా :రూ.300 ఎస్‌ఈడీ టికెట్లను ఆయా రాష్ట్రాల ఆర్టీసీ ఏజెంట్లు, పర్యాటక శాఖల ద్వారా భక్తులకు అందించేవారు. ఇక్కడే అసలు దోపిడీ జరిగింది. పర్యాటక శాఖ, ఆర్టీసీల నుంచి టికెట్లు పొందిన ఏజెంట్లు సోషల్ మీడియాలో వాటిని విక్రయానికి ఉంచారు. దర్శన టికెట్లు కావాలని వారిని సంప్రదించినవారికి రూ.300 టికెట్‌ను డిమాండ్‌ను బట్టి రూ.1500 నుంచి రూ.2500 వరకు అమ్మారు.
- హైదరాబాద్‌కు చెందిన రమేష్ శ్రీవారి దర్శనార్థం తెలంగాణ పర్యాటకశాఖ అనుమతి పొందిన ఏజెంట్‌ను సంప్రదించారు. తిరుమలకు రానూపోనూ టికెట్లు, శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లను పొందేందుకు మూడింతల ధర వసూలుచేశారు.
- చెన్నైకి చెందిన సుబ్రమణియన్ శ్రీవారి దర్శనానికి తమిళనాడు టూరిజం ఏజెంట్‌ను సంప్రదించగా ఆయన నుంచి దర్శన టికెట్లతోపాటు రానూపోనూ ఛార్జీలు కలిపి రెండింతలు వసూలుచేసినట్లు విచారణలో వెల్లడైంది.
- మరికొందరు ఏజెంట్లు భక్తులకు రూ.300 టికెట్లను బస్సు టికెట్లతోపాటు విక్రయించాల్సి ఉంది. కానీ రెండింటి ధర వసూలు చేసి దర్శన టికెట్లనే విక్రయించినట్లు వెల్లడైంది.