TIDCO Beneficiaries issues :సొంతింటి కల నెరవేరిందని కొండంత ఆశతో అక్కడికి వెళ్లిన వారికి నిరాశే ఎదురైంది. హడావుడిగా గృహప్రవేశాలు చేయించిన గత పాలకులు తర్వాత పట్టించుకోలేదు. ఇళ్ల తాళాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప కనీస వసతులు కల్పించలేదు. ఫలితంగా నేటికీ టిడ్కో లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. పేదింటి కలల సౌధం కాస్తా సమస్యల ఆవాసంగా మారింది.
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో 220 బ్లాకులుగా టిడ్కో ఇళ్లు నిర్మించారు. జీ ప్లస్ త్రీ నమూనాలో 300, 365, 430 చదరపు అడుగుల్లో మూడు కేటగిరీల్లో గృహాలు నిర్మించారు. గత టీడీపీ పాలనలోనే 80 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ సర్కార్ మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయకుండా గాలికొదిలేసింది. విపక్షాల ఆందోళనలు లబ్ధిదారుల ఒత్తిడితో చివరకు ఇళ్లు పంపిణీ చేసింది. గతేడాది ఏడాది జూన్ 16న సీఎం హోదాలో ఆర్భాటంగా ఇళ్లు ప్రారంభించిన జగన్ వసతుల కల్పనను మర్చిపోయారు. అంతే ఇక అప్పటి నుంచి ఇప్పటికీ సదుపాయాలు లేక లబ్ధిదారులు ముప్పుతిప్పలు పడుతున్నారు.
గుడ్న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం - టిడ్కో ఇళ్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
గుక్కెడు నీటి కోసం స్థానికులు అల్లాడుతున్నారు. రెండ్రోజులకోసారి వచ్చే నీటి కోసం మహిళలు యుద్ధాలే చేయాల్సి వస్తోంది. ట్యాంకర్ల ద్వారా అందించే నీరు సరిపోక డబ్బులు పెట్టి నీటిని కొనుక్కుని గొంతు తడుపుకుంటున్నారు. ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ మరో ప్రధాన సమస్య. రోజుల తరబడి చెత్త తీయకపోవడం వల్ల దుర్గంధం వ్యాపించి రోగాల బారిన పడుతున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు, ఈగలతో సహవాసం చేస్తున్నారు.