Two Died After Falling Into a Well in Srikakulam District: కార్తిక పౌర్ణమి రోజు విషాదం చోటు చేసుకుంది. వారిద్దరూ మేనమామ, మేనల్లుడు. బావిలో పడిన మేనమామను రక్షించేందుకు ప్రయత్నించిన మేనల్లుడు సైతం జారిపడి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అసలు ఇంతకు ఏం జరిగిందంటే.
శుక్రవారం రాత్రి గ్రామంలోని రఘుపతి మధుసూదన్ రావు (56) ఇంట్లోకి పాము వచ్చింది. అందరూ కంగారు పడ్డారు. ఆ కేకలకు ఇంట్లో నుంచి వచ్చిన మధుసూదన్ రావు పామును చంపేందుకు యత్నించాడు. కర్రతో ఓ దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత పాము అక్కడే బావిలో పడిపోయింది. దీంతో అందరూ కంగారు పడ్డారు. శనివారం ఉదయం బావి నుంచి నీటిని తోడేయాలని భావించారు.
శనివారం ఉదయం బావిలో నీళ్లు తోడేందుకు సిద్ధమయ్యారు. ఇంజిన్ సహాయంతో నీళ్లన్నీ బయటకు తీసేస్తున్నారు. కానీ ఇంతలోనే మరో ఘటన జరిగింది. నీటిని తోడుతున్న ఇంజిన్ బావిలో పడిపోయింది. దీన్ని తీసే క్రమంలో మధుసూదన్ రావు బావిలో పడిపోయాడు. ఇది చూసి అతన్ని రక్షించేందుకు మధుసూదన్ రావు మేనల్లుడు కింతలి డిల్లేశ్వర రావు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. బావిలోకి దిగి మేనమామను బయటకు తీసుకు రావాలనుకున్నాడు. ఇదే క్రమంలో డిల్లేశ్వరరావు బావికి దిగుతున్నాడు. కానీ మళ్లీ మరో ప్రమాదం జరిగింది. డిల్లేశ్వరరావు సైతం బావిలో పడిపోయాడు. ఈ క్రమంలో మేనమామ, మేనల్లుడులిద్దరూ ప్రాణాలొదిలారు.