Palnadu District Police in Fear : గత వైఎస్సార్సీపీ పాలనలో అరాచకాలకు పాల్పడిన పోలీసులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. ముఖ్యంగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ కిడ్నాప్ కేసుపై ఇప్పటికే ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి గురజాల డీఎస్పీ పల్లపురాజు, పిడుగురాళ్ల ఎస్సై రబ్బానిలపై కేసులు సైతం నమోదు చేసింది. 2019 నుంచి 2024 వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించి వైఎస్సార్సీపీ పెద్దలకు వంతపాడిన వారిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే పని చేసిన ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలపై రిపోర్టులు ప్రభుత్వం వద్ద ఉన్నట్లు కొందరు పోలీసు అధికారులు చెబుతున్నారు.
బెట్టింగ్ రాయుళ్లు నుంచి లక్షల రూపాయలు:గతంలో గురజాల డీఎస్పీగా పని చేసిన పల్లపురాజుపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా బెట్టింగ్ రాయుళ్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. దీనికి సంబంధించి రెంటచింతలకు చెందిన ఓ ముఠాను అడ్డుపెట్టుకొని బెంగళూరు వరకు స్వయంగా వెళ్లి అక్కడ నుంచి వారిని పట్టుకొని తీసుకొస్తూ దారిలోనే బెదిరింపులకు పాల్పడి కేసులు లేకుండా చేసి 25 లక్షల రూపాయల వరకూ వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయంలో అప్పట్లో జిల్లాలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులకు సైతం వాటాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది.
వెలుగులోకి వెంకటరెడ్డి లీలుల - చైనా యంత్రాలతో దోపిడీకి స్కెచ్
అదే విధంగా పల్నాడు ప్రాంతంలో బెట్టింగ్ ఆడే వారిని అదుపులోకి తీసుకొని 10 లక్షల రూపాయల వరకు వసూళ్లు చేశారు. గురజాలలో ఓ దొంగతనానికి సంబంధించి భారీగా ముడుపులు తీసుకున్నట్లు తెలుస్తోంది. 5 లక్షల రూపాయలు తక్కువ అయితే పట్టించుకోని స్థాయిలో డీఎస్పీ వ్యవహరించినట్లు పేరుంది. పిడుగురాళ్ల పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ న్యాయవాదిపైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. దీనిపై ప్రస్తుతం క్రిమినల్ కేసు నమోదైంది. జూదం ఆడే వారి వద్ద నుంచి భారీగా దోచుకున్నట్లు తెలుస్తోంది. గురజాలకు చెందిన ఓ వైఎస్సార్సీపీ నాయకుడిని అడ్డుపెట్టుకొని భారీగా వసూళ్లకు పాల్పడ్డారు.