Tennis player Rafael Nadal Special Bonding With Andhra Pradesh :టెన్నిస్‌ను ఓ దశాబ్దకాలం పాటు శాసించిన ఆటగాడు రఫెల్ నాదల్. గ్రాండ్ స్లామ్, ఒలింపిక్స్ టెన్నిస్ పోటీల్లో ఎన్నో విజయాలు చవిచూసిన ఈ దిగ్గజానికి అనంతపురంతో ఆత్మీయ అనుబంధం ఉంది. మట్టి కోర్టుల కింగ్‌గా పేరు తెచ్చుకున్న నాదల్ తన సంపాదనలో కొంత టెన్నిస్ అభివృద్ధికి ఖర్చు పెడుతున్నారు.
ప్రపంచంలో నాదల్ ఫౌండేషన్ టెన్నిస్ పాఠశాలలు మూడు ఉండగా అందులో ఒకటి అనంతపురంలో ఉండటం విశేషం. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)తో ఉన్న అనుబంధంతో అనంత క్రీడా గ్రామంలో నాదల్ ఎడ్యుకేషనల్, టెన్నిస్ స్కూలును ప్రారంభించారు. దీని నిర్వహణకు ఏటా రూ.55 లక్షలు పంపిస్తున్నారు. ఖరీదైన టెన్నిస్ క్రీడను పేద ప్రతిభావంతులకు చేరువ చేయాలన్న సంకల్పంతో ఆయన ఈ పాఠశాలను స్థాపించారు. స్వదేశం స్పెయిన్‌తో పాటు దుబాయ్, అనంతపురంలో నాదల్ టెన్నిస్ పాఠశాల నిర్వహిస్తున్నారు. 38 ఏళ్ల నాదల్ ఇటీవల టెన్నిస్‌కు వీడ్కోలు ప్రకటించిన నేపథ్యంలో అనంతపురం నాదల్ అకాడమీ వివరాలు ప్రస్తావనార్హం.
టెన్నిస్ అంటే ఖరీదైన క్రీడ. టెన్నిస్ రాకెట్ (బ్యాట్) కొనడం పేదలకు సాధ్యమయ్యే పని కాదు. బంతులు, కోర్టు నిర్వహణ ఖర్చులు అదనంగా భరించాలి. అదే నాదల్ అకాడమీలో చేరితే ఒక్క పైసా ఖర్చు లేకుండా టెన్నిస్ పై పట్టు సాధించవచ్చు. ఈ అకాడమీలో ఆటతోపాటు పౌష్టికాహారం, ఆంగ్లంలో శిక్షణ, కంప్యూటర్‌పై అవగాహన కూడా కల్పిస్తారు. నాదల్ అకాడమీ ప్రారంభమైన తర్వాత పేద, మధ్య తరగతి బాలబాలికలు ఎంతో మంది శిక్షణ పొందారు.
ఈ అకాడమీ ద్వారా ఇప్పటివరకు 2,500 మందిని టెన్నిస్ క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. నాదల్ అకాడమీలో ఒక సమన్వయకర్త, ఒక కంప్యూటర్ శిక్షకుడు, టెన్నిస్ శిక్షకులు ముగ్గురు, ఇద్దరు వాలంటీర్లు, ఆరుగురు కోర్టుల నిర్వహణకు పనిచేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో టెన్నిస్‌లో ఇక్కడ శిక్షణ ఇస్తారు.
టెన్నిస్ నేర్చుకోవాలన్న కుతూహలం, పట్టుదల ఉన్న ఎవరినైనా ఇక్కడ చేర్చుకుంటారు. పేద, ధనిక లాంటి నిబంధనలు ఉండవు. అందరికీ శిక్షణ ఉచితం. నేర్చుకునేందుకు వచ్చిన పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. సాధన తర్వాత రోజు వీరికి ఏదో ఒక ఆహారం ఇస్తారు. రాగి జావ, అరటి పండ్లు, పాలు, గుడ్లు, చిక్కీలు, గుగ్గిళ్లు లాంటి ఆహారం అందజేస్తారు. ఆహారంతోపాటు వీరికి భావవ్యక్తీకరణపై అవగాహన కల్పిస్తారు.