Telugu Wikipedia Festival 2025 :గ్రామాలు, ప్రముఖ వ్యక్తులు, చారిత్రక కట్టడాలు ప్రదేశాలు ఇలా ఏ సమాచారం కావాలన్నా వెంటనే గుర్తుకొచ్చేది వికీపీడియానే. ఇది తెలుగులోనూ విజ్ఞానాన్ని అందిస్తోంది. మొబైల్ యాప్‌లోనూ సమాచారం తెలుసుకునే వీలుంది. ఈ క్రమంలోనే తెలుగు వికీపీడియా పండగ 2025ను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 50 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.
2003లో ప్రారంభమైన తెలుగు వికీపీడియా ఇప్పటివరకు లక్షకు పైగా వ్యాసాలను కలిగి ఉంది. ఈ సందర్భంగా వికీపీడియాను విస్తరించే మార్గాలు, సభ్యుల వ్యాస రచనా నైపుణ్యాల మెరుగుదల, వ్యాసాలను ప్రజలకు మరింత ఆసక్తికరంగా రూపొందించే పద్ధతులు, తదితర కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. అనంతరం తెలుగు వికీపీడియాలో చేరండి - అందరికీ విజ్ఞానం పంచండి అనే నినాదంతో తిరుపతి వీధుల్లో సభ్యులు ర్యాలీ నిర్వహించారు. కరపత్రాలను పంచి ప్రజలకు దీనిపై అవగాహన కల్పించారు.