Telangana HC Sentenced Hanging to Child Rapist and Murderer : అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై 2017లో అత్యాచారం చేసి హతమార్చాడు ఓ కిరాతకుడు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జరిగిన ఈ విషాద ఘటన అప్పట్లో అందరినీ కలచి వేసింది. తాజాగా కింది కోర్టు నిందితుడికి విధించిన ఉరిశిక్షను సమర్థిస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2017 డిసెంబరు 12న మధ్యాహ్నం ఇంటిముందు ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా ఆమె తల్లి ఇంట్లోకి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన మధ్యప్రదేశ్‌కు చెందిన దినేశ్ కుమార్ చాక్లెట్ ఇప్పిస్తానని బాలికను రమ్మన్నాడు.
పక్కింటి వాడే కావడంతో బాలిక అతని దగ్గరకు వెళ్లింది. చిన్నారిపై రెండుసార్లు నిందితుడు అత్యాచారం చేశాడు. ఘటన గురించి చెబుతుందని భావించిన దినేశ్, అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని సిమెంట్ రాయితో కొట్టి చంపాడు. తిరిగి ఏమీ తెలియనట్లు లేబర్ క్యాంపునకు చేరుకున్నాడు. అతనితో బాలిక వెళ్లేటప్పుడు చూసిన తల్లి, తన కుమార్తె గురించి ఆరా తీసింది. ఇంటి దగ్గర దించి వెళ్లానని, ఎక్కడో ఆడుకుంటూ ఉంటుందని ఆమెకు దినేశ్ బదులిచ్చాడు. సాయంత్రం ఐదున్నర వరకు వెతికినా కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో నిందితుడ్ని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నేరాన్ని అంగీకరించిన నిందితుడు, ఘటన స్థలానికి పోలీసులను తీసుకెళ్లి చూపించాడు.
దిగువ కోర్టు విధించిన ఉరి శిక్షను సమర్థించిన హైకోర్టు : ఈ కేసులో వాంగ్మూలాలు, ఆధారాలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కోర్టు, 2021 ఫిబ్రవరి 9న దినేశ్‌కు ఉరిశిక్ష విధించింది. తీర్పును ఖరారు చేయాలని హైకోర్టుకు నివేదించింది. 2023లో జిల్లా కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని దినేశ్‌కుమార్ అప్పీల్ దాఖలు చేశాడు. ఇందులో ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో కింది కోర్టు విధించిన ఉరి శిక్షను హైకోర్టు ఖరారు చేసిన మొదటి కేసు ఇదే. ఐదేళ్ల చిన్నారిని కిరాతకంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఈ కేసు అత్యంత అరుదైనదిగా ఉన్నత న్యాయస్థానం కోర్టు పేర్కొంది.