Telangana High Court On Sewage Water Vegetables cultivation :కూరగాయల కోసం మార్కెట్‌కు వెళతాం. తాజా వాటి కోసం వెతుకుతాం. వెతికి వెతికి మంచివి, పుచ్చులు లేనివి ఎంచుకుంటాం. ఇంటికి తీసుకువెళ్లి బాగా శుభ్రం చేసి వండుకుంటాం. తాజా కూరగాయలు వండుకున్నాం అన్న సంతృప్తితో భోజనం చేస్తాం. అయితే ఇది నిజం కాదు. ఎంతో జాగ్రత్తగా శుభ్రమైన కూరగాయలు కొనుగోలు చేశామని అనుకుంటున్నా, విష పదార్థాలతో కూడిన కూరగాయలు కూడా మన వంటింట్లోకి చేరుతున్నాయి. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Sewage Water Vegetables cultivation :హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కలుషితమయమైన చెరువుల నీటితో కూరగాయలు, ఆకు కూరల సాగును అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మురుగు నీటితో సాగైన కూరగాయలు, ఆకు కూరలు ప్రజారోగ్యంపై ప్రభావం చూపిస్తాయని, అందువల్ల ఇవి మార్కెట్‌లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జన బాహుళ్యంలోకి కలుషిత నీటితో పండిన కూరగాయలు వస్తున్నాయా అనే అంశం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఇది ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మాత్రమే కాదు, దేశంలోని అనేక ప్రాంతాల్లో సాగడం కలవరపెడుతోంది.
మురుగునీటితో కూరగాయలు పండిస్తున్నారా? రాష్ట్రప్రభుత్వానికి నోటీసులిచ్చిన హైకోర్టు
కలుషిత నీటితో సాగయ్యే కూరగాయల్లో చేరుతున్న విష పదార్థాల గురించి గతంలో పలు అధ్యయనాలు భయంకరమైన వాస్తవాలను వెల్లడించాయి. హైదరాబాద్ చుట్టుపక్కల మూసీ నీటితో సాగు అవుతున్న కాయగూరల్లో ప్రమాదకర ఆర్సెనిక్, కాడ్మియం, లెడ్ వంటి విష పదార్థాలు ఉన్నట్లు ఇవి తేల్చాయి. బెంగళూరు, భోపాల్, వారణాసి నగరాల చుట్టుపక్కల కలుషిత జలాలతో పండించిన బీన్స్, కొత్తి మీర, పాలకూర, వంకాయ వంటి కూరగాయల్లో భార లోహాల ఆనవాళ్లు పరిమితికి మించి వెలుగు చూశాయి.
వాటి మూలంగా క్యాన్సర్ల ముప్పు పెచ్చుమీరుతోంది. చర్మవ్యాధులూ సంభవిస్తున్నాయి. తాజా కూరగాయలు అని నమ్మి, మనం కొని వండుకు తింటూ ఉంటే అవి మనకు తెలియకుండానే ఇలా విష పదార్థాలను శరీరంలోకి పంపిస్తున్నాయి. పోషకాలను అందించడానికి బదులు, కొత్త రోగాలు వచ్చేందుకు కారణం అవుతున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి లేకున్నా, అనేక చోట్ల మాత్రం ఈ సమస్య తాండవిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
మురుగునీటితో సాగైన కూరగాయలు : దేశంలో కలుషిత జల వనరుల వల్ల కూరగాయలు విషతుల్యం కావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. జనాభా పెరుగుదల, గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు, ఫలితంగా పట్టణాలు ఇరుకుగా మారి నిర్మాణాల కోసం నదులు, చెరువులు, కుంటలు, సరస్సులు వంటి నీటి వనరుల ఆక్రమణ ప్రధాన కారణం. ఆక్రమణలు పోను మిగిలి ఉన్న నీటి వనరుల చుట్టూ జనావాసాలు, పరిశ్రమలు పెరిగి అవి కాలుష్యమయంగా మారుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చిన హైకోర్టు :గృహ, పారిశ్రామిక, వాణిజ్య సముదాయ వ్యర్థాల విచ్చలవిడి పారబోతతో నదులు, చెరువులుకాలుష్యం బారిన పడుతున్నాయి. ముంచెత్తుతున్న మురుగు నీరు, విష వ్యర్థాలు, ఇష్టారీతిన కబ్జాలు దేశవ్యాప్తంగా చెరువులకు మరణ శాసనం లిఖిస్తున్నాయి. నదీ జలాలను విషతుల్యంగా మార్చేస్తున్నాయి. పర్యవసానంగా ఆయా నదీ పరీవాహక ప్రాంతాల్లో పంట భూములు నిస్సారంగా మారుతున్నాయి. భూగర్భ జలాలూ పనికి రాకుండా పోతున్నాయి. ఆ నీటితో పండిన కూరగాయలు, ఆకు కూరలు విషతుల్యమై ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి.