Telangana High Court Interim Orders On N Convention Demolition :సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కూల్చివేతపై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈక్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతకముందు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం తరఫున న్యాయవాది శ్రీరఘురాం బలంగా వాదనలు వినిపించారు. కాగా హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం పలు విషయాలను వెల్లడించింది.
సినీ నటుడు అక్కినేని నాగార్జున కొన్ని సంవత్సరాల కిత్రం అప్పటి ప్రభుత్వ సర్వే ప్రకారం స్వార్జితంతో కొనుగోలు చేసిన భూమిలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని పేర్కొన్నారు. 2010-12 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తైందని, అయితే ఆ భూమి చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందని ఆనాటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. నోటీసులు జారీచేసిన భూమి మీద మరో మూడు, నాలుగు సర్వే రిపోర్టులు సైతం సర్క్యులేషన్‌లో ఉన్నాయని, దీంతో నాగార్జున ప్రభుత్వ నోటీసులపై కోర్టుని ఆశ్రయించినట్లు తెలిపారు.
సర్కార్ ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధింపు : ఈ అంశంపై రూ.9 కోట్లు డిపాజిట్‌గా కట్టి ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే తమ నిర్మాణానికి తగిన మార్పులు చేస్తామని గతంలో నాగార్జున అంగీకరించినట్లు పిటిషన్‌లో చెప్పుకొచ్చారు. అందుకు సమ్మతించిన ధర్మాసనం సర్కార్ ఉత్తర్వులపై స్టే విధించింది. కోర్టు ఆర్డర్ ప్రకారం స్టేలో ఉండగా, దానిని బేఖాతరు చేస్తూ ప్రస్తుతం ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత ప్రక్రియను చేపట్టిందని పిటిషన్‌లో వెల్లడించారు.